మళ్లీ పోలియో మహమ్మారి

23 Sep, 2016 03:39 IST|Sakshi
మళ్లీ పోలియో మహమ్మారి

* అంబర్‌పేట, నాగోలు నీటి శుద్ధి ప్లాంట్లలో బయటపడిన 2 కేసులు
* ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ పోలియో వైరస్ వెలుగు చూసింది. నాలుగు నెలల్లోనే మళ్లీ పోలియో వైరస్ వెలుగు చూడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. సరిగ్గా గత జూన్ నెలలో అంబర్‌పేట మురుగునీటి నాలాలో పోలియో వైరస్ బయటపడిన సంగతి తెలిసిందే. మళ్లీ అంబర్‌పేట, నాగోలుల్లోని మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో టైప్-2 వ్యాక్సిన్ వైరస్ బయటపడిందని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఇది ప్రమాదకారి కాదని ఆయన వివరించారు.

గత నెల 28వ తేదీన అంబర్‌పేట, నాగోలుల్లోని మురుగునీటి శుద్ధిప్లాంట్ల నుంచి శాంపిళ్లను సేకరించి ముంబైలోని ఈఆర్‌ఎస్ లేబరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. ఆ పరీక్షల్లో రెండు చోట్ల కూడా పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించాక సంబంధిత వైరస్ హైదరాబాద్‌లో నాలుగు నెలల్లోనే రెండుసార్లు వెలుగు చూడటంతో వైద్య ఆరోగ్యశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మనుషుల్లో కాకుండా మురికి నీళ్లలో ఈ వైరస్ రావడానికి గల కారణాలపై పరిశోధన జరుగుతోంది.

పోలియో వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన వైద్యాధికారులు, ఔషధ నియంత్రణ అధికారులు, మిలటరీ, రైల్వే, ఆర్టీసీ, ఐపీఎం అధికారులు హాజరయ్యారు.
 
ఎలాంటి వైరస్ ఇది..? ఎలా వచ్చింది..?
ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీ వరకు రాష్ట్రంలో ట్రైవలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (నోటి ద్వారా వేసే వ్యాక్సిన్-టీవోపీవీ)ను పిల్లలకు వేసేవారు. ఆ తర్వాత నుంచి దాన్ని నిషేధించారు. ఎందుకంటే నోటిద్వారా వేసే వ్యాక్సిన్‌లో బతికున్న పోలియో వైరస్ ఉంటుంది. అది సురక్షితం కాదని ఆ తర్వాత నుంచి ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే టీవోపీవీ వ్యాక్సిన్‌ను ఇంకా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడైనా ఉంచి ఉంటారని అనుమానిస్తున్నారు. వాటిని విచ్చలవిడిగా బయట పారేయడం వల్లే ఇప్పుడు పోలియో వెలుగు చూసిందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదకరమైన దీన్ని వేడినీళ్లలో మరగించి ప్రత్యేక పద్ధతుల్లో నాశనం చేయాలి. కానీ వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది మురుగునీటిలోకి వెళ్లిందని అధికారులు చెబుతున్నారు.
 
నేటి నుంచి మూడు రోజులు ప్రత్యేక డ్రైవ్
ఈ వైరస్ మురుగు నీటిలోనే ఉండి పోయిందా? మురుగు నీటి నుంచి తాగునీటిలో కలిసి పిల్లలెవరికైనా సోకిందా? అన్న అనుమానాలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 జిల్లాల్లోని జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడైనా టైప్-2 వ్యాక్సిన్ ఇంకా ఉంటే.. వాటిని గుర్తించి నాశనం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. వివిధ శాఖలకు చెందిన 800 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు