పగలకపోతే బా'గుండు'!

15 May, 2020 12:03 IST|Sakshi

నంబర్‌గుండు గుట్టపై అక్రమార్కుడి కన్ను  

6 నెలలుగా సీలింగ్‌ భూమిలో ఉన్న గుట్టను తొలిచేస్తున్న వైనం

కడప కూలీలతో రాత్రివేళ బ్లాస్టింగ్‌ పనులు  

బెంబేలెత్తుతున్న జనం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రం నుంచి కూతవేటు దూరంలో ఉన్న ‘నంబర్‌గుండు’ గుట్ట గుల్లవుతోంది. ఓ అక్రమార్కుడి ధనదాహానికి రోజురోజుకు రూపం కోల్పోతోంది. ఆరు నెలల నుంచి రోజుకు కొంత మేర తొలిచివేతకు గురవుతున్న ఆ గుట్ట రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతోంది. మరోవైపు రాత్రిపూట కొనసాగుతున్న బ్లాస్టింగ్‌లతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు? ఏ బండ తమ ఇంటికప్పు మీద పడుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బ్లాస్టింగ్‌లతో గుట్ట రాళ్లు సమీప పంటపొలాల్లో వచ్చి పడుతుండడంతో ఇటు రైతులూ ఇబ్బందులు పడుతున్నారు. ఇదేంటనీ ప్రశ్నించిన తమకు సదరు అక్రమార్కుడి నుంచి బెదిరింపులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ తతంగంపై రెవెన్యూ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధిత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన సదరు అక్రమార్కుడు.. అధికారుల అండదండలతో గుట్టను తోడేసే పనిని ముమ్మరం చేశాడు.

మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టమీది తండాలోని సర్వేనంబర్‌ 23లో 154 ఎకరాల విస్తీర్ణంలో సీలింగ్‌ భూమి ఉంది. ఇందులో ఆరు ఎకరాలను అధికారులు ఇతరులకు అసైన్డ్‌ చేశారు. కాగా మిగతా భూమిలో నంబర్‌గుండు గుట్ట ప్రాంతం ఉంది. అయితే ఈ గుట్టపై కన్నేసిన ఓ అక్రమార్కుడు ఆరు నెలల నుంచి గుట్టను తొలుస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి డిటోనెటర్లు పెట్టి రాత్రి పూట పేలుళ్లకు పాల్పడుతున్నాడు. బ్లాస్టింగ్‌ ధాటికి రాళ్లు వచ్చి తమ ఇళ్లపై పడుతున్నాయని గుట్టమీది తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో ఆగని సదరు అక్రమార్కుడు గుట్టను పగలగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి ప్రత్యేకంగా 20 మంది కూలీలనూ రప్పించడం గమనార్హం. గుట్టను పగలగొట్టడంలో సిద్ధహస్తులైన ఈ కూలీలు స్థానిక కూలీలతో కలిసి పెద్ద మొత్తంలో ప్రకృతి వనరు అయిన గుట్టను గుల్ల చేస్తున్నారు. ఇలా తీసిన రాళ్లను రూ. 24కు ఒకటి చొప్పున మహబూబ్‌నగర్‌ పట్టణం, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు. సదరు అక్రమార్కుడు ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కావడంతో అధికారులూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో అక్రమార్కుడి అక్రమాలపై నోరు మెదిపేందుకూ ఆయా తండావాసుల్లో చాలా మంది సాహసించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నంబర్‌గుట్టను కాపాడడంతో పాటు సదరు అక్రమార్కుడిపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.   

భయపెట్టిండు..
ఎప్పటి నుంచో నంబర్‌ గుండు ఉంది. ఆ గుండును పగలగొట్టకూడదని చెబితే, నా చేను పక్కనే ఉంది. నేను కొట్టుకుంటా. అడగటానికి నీవెవరు. నీ యబ్బ జగీరా.. అని భయపెట్టిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుండ్లను పూసలు పెట్టి పేలుస్తున్నారు. ఆ రాళ్లు తండాలోకి వచ్చి పడుతున్నాయి. దీంతో మేం భయాందోళనకు గురవుతున్నాం. ఈ అక్రమంపై వీఆర్‌ఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు.     – లక్ష్మణ్‌నాయక్, గుట్టమీదితండా

బాధ్యులపై చర్య తీసుకుంటాం
గుట్టమీది తండా సమీపంలో రాళ్లగుట్టను బ్లాస్టింగ్‌ చేస్తున్నారనే ఫిర్యాదు ఇది వరకే వచ్చింది.వెంటనే వీఆర్‌ఓను పంపి.. రాళ్లను పగులగొట్టడాన్ని నిలిపివేయించా. ఒకవేళ అలాగే గుట్టలో బ్లాస్టింగ్‌కు పాల్పడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.– ఎస్‌.కిషన్, తహసీల్దార్, మహబూబ్‌నగర్‌ రూరల్‌

మరిన్ని వార్తలు