అసెంబ్లీ మీడియా పాయింట్: ఎవరెవరూ ఏమన్నారూ..?

28 Nov, 2014 01:53 IST|Sakshi

 ‘మెట్రో’పై మజ్లిస్‌తో టీఆర్‌ఎస్ కుమ్మక్కు
 మెట్రో అలైన్‌మెంట్ విషయంలో టీఆర్‌ఎస్ ఎంఐఎంకు దాసోహంగా వ్యవహరించింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఎవరినీ సంప్రదించలేదు. ఒకే ఎమ్మెల్యేలను పిలిచి సమీక్ష నిర్వహించడం తగదు. ఎంఐంఎ సూచించిన అలైన్‌మెంట్‌తో ఇబ్బందులు తప్పవు.మెట్రోరైలుపై టీఆర్‌ఎస్ వైఖరీ స్పష్టంగా లేదు.విపక్షాలను సంప్రదించలేదు. సలహాలు, సూచనలు తీసుకోలేదు.  కేవలం ఎంఐఎం కనుసన్నల్లో టీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ నడుపుతుందా? ఎంఐఎం నడుపుతుందా? అర్థం కావడం లేదు.    
 - కె.లక్ష్మణ్ బీజేపీ ఎమ్మెల్యే
 
 సింగరేణి కార్మికులకు వైద్య సేవలందించాలి
 సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ప్రస్తుతం వైద్యసేవలు అధ్వానంగా ఉన్నాయి. కార్మికుల కుటుంబాలకు కూడా వైద్య సేవలు అందించాలి.    
 - పీ వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ  ఎమ్మెల్యే
 
 ఆ ముగ్గురూ వ్యతిరేకంగా ఓటు వేయాలి
 టీడీపీ బీ ఫాంపై గెలిచి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు విప్‌ను అందజేశాం. ప్రభుత్వానికి వ్యతి రేకంగా ఓటు వేయాలి. విప్ ఉల్లఘించాలనుకుంటే  పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో దిగాలి. లేకుంటే ప్రజలు క్షమించరు. సభలో రేవంత్‌రెడ్డిని మాట్లాడనీయకుండా గొంతునొక్కుతున్నారు. చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు.ప్రజా శ్రేయస్సుపై టీఆర్‌ఎస్‌కు పట్టింపు లేదు.     
 -సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ ఎమ్మెల్యే
 
 కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత కల్పించాలి
 రాష్ట్రంలోని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పే కమీషన్ పీఆర్‌సీని అమలు చేయాలి.
 - సున్నం రాజయ్య , సీపీఎం ఎమ్మెల్యే
 
 చర్చ జరగకుండా అడ్డగింతలు
 ప్రజాసమస్యలపై చర్చ జరుగకుండా అడ్డుకుంటున్నారు. చంద్రబాబు మోసం, పొన్నాల పాపాల పుట్ట బయట పడుతుందని అడ్డుకుంటున్నారు. నిజాలు బయటపెట్టి తీరుతాం. టీడీపీ-బీజేపీలు సభలో దుర్మార్గాంగా వ్యవహరిస్తున్నాయి. ఇంకా ఆంధ్ర పెత్తనాన్ని సహించం.
 -వి.శ్రీనివాస్‌గౌడ్,జీవన్ రెడ్డి,
 రామలింగారెడ్డి, రమేష్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
 
 ఆంధ్ర దుర్మార్గాలు తెలంగాణలో సాగవు
 ఆంధ్ర దుర్మార్గాలు తెలంగాణలో సాగవు. తెలంగాణను అడుగడుగున అడ్డుకున్న విషయం అందరికి తెలుసు.ప్రస్తుతం  విద్యుత్‌ను కూడా అడ్డుకుంటున్నారు. నాక్ చైర్మన్‌గా చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది.
 - ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
 
 సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు  
 హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో బంజారా, ఆదివాసీ భవన్‌లు నిర్మించేందుకు రెండు ఎకరాల స్థలం కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా ఆనందకరం. అడగకుండానే కల్యాణలక్ష్మి పథకం అందజేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గిరిజనులు, ఆదివాసీలకు కూడా ఎస్సీలతో సమానంగా మూడు ఎకరాలు భూమి కేటాయించేందుకు కూడా సీఎం అంగీకరించారు. 500 కుటుం బాల కంటే ఎక్కువ ఉన్న తండాలను పంచాయతీలుగా మార్చేందుకు కూడా ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు.     
 -గిరిజన ఎమ్మెల్యేలు మదన్‌లాల్,
     శంకర్‌నాయక్, రేఖానాయక్,
 బాబూరావునాయక్, కోవలక్ష్మి
 
 సభను అడ్డుకోవడం దురదృష్టకరం
 ప్రశ్నోత్తరాలసమయంలో సభను అడ్డుకోవడం దురదృష్టకరం. భూముల విషయంలో టీడీపీ బండారం బయట పడుతుందని అడ్డుకుంటున్నారు. మెట్రోరైలు అలైన్‌మెంట్‌పై సమాధానాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సభను అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకోవడమే. విభజనచట్టం ప్రకారం రూల్స్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నడుస్తున్నారు.  
 - కొండా సురేఖ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
 
 లాబీ ముచ్చట్లు: ఎందుకీ ఎమ్మెల్యే పదవి..!?
 ‘బీసీ సంఘ నేతగా ఉన్నప్పుడు ఈ నాయకులంతా నా దగ్గరికే వచ్చే వారు. ఇప్పుడు ఒక్కరూ పట్టించుకోవడం లేదు. చివరకు టీడీపీ నాయకత్వం కూడా అలాగే  కనిపిస్తోంది. మాట్లాడడానికి అవకాశమే ఇవ్వడం లేదు. ఇక్కడి కంటే బయటే బావుంది.. ఎందుకీ ఎమ్మెల్యే పదవి..’.. ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వైరాగ్యంతో చేసిన వ్యాఖ్యలివి! అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజు నుంచీ ఆయన టీడీపీతో అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు వారం పాటు సస్పెండైనరోజు సభలో లేని ఆయన.. మరుసటిరోజు సభకు వచ్చి బడ్జెట్ వివరణలపై మామూలుగా చర్చలో పాల్గొన్నారు. ఒక విధంగా తనకు సభలో గుర్తింపే లేదన్న బాధ ఆయన మాటల్లో వ్యక్తమైంది. ‘నేను రాజీనామా చేద్దామనే అనుకుంటున్నా.. కానీ మా వాళ్లంతా వద్దని అడ్డం పడుతున్నారు..’ అని ఆయన గురువారం అసెంబ్లీ లాబీల్లో వ్యాఖ్యానించారు.
 
 రేవంత్.. మళ్లీ సస్పెండ్!
 టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని మళ్లీ సస్పెండ్ చేస్తారన్న వార్త అసెంబ్లీ లాబీల్లో ఒక్కసారిగా గుప్పుమంది. గురువారం మధ్యాహ్నం సభ వాయిదాపడే ముందు తనకు మాట్లాడడానికి అవకాశమివ్వాలని రేవంత్ మరోసారి స్పీకర్‌ను కోరారు. కానీ స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెంది రేవంత్ హెడ్‌ఫోన్స్‌ను విసురుగా నేలకు విసిరి కొట్టారు. దీంతో స్పీకర్ విషయంలో రేవంత్ అనుచితంగా ప్రవర్తించార ని, ఆయన తిరిగి సభలోకి వెళ్లగానే సస్పెండ్ చే స్తారని ప్రచారం జరిగింది. ఈ సస్పెన్షన్ ఒక రోజా, మిగిలి ఉన్న రెండు రోజులా? అంటూ పలువురు వాకబు కూడా చేశారు. అసలు రెండు మూడు నెలల పాటు అని.. కాదు కాదు ఆరు నెలలు సస్పెండ్ అయినట్లేనని కూడా చెప్పుకొన్నారు. పారిశ్రామిక బిల్లుపై మాట్లాడేందుకు టీడీపీ తరఫున రేవంత్‌రెడ్డి లేస్తారని, అప్పుడు సస్పెండ్ చేస్తారని ఊహాగానాలు బయలుదేరాయి.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా