జై సోషల్‌ మీడియా!

29 Mar, 2019 01:37 IST|Sakshi

సంప్రదాయ ప్రచారానికి స్వస్తి

ప్రజల్లో మార్పు రావటంతో మారిన నేతల ప్రచార తీరు

జనాన్ని చేరుకునేందుకు అదే మేలంటున్న అభ్యర్థులు

ఐటీ విభాగాలు ఏర్పాటు చేసుకుని మరీ ప్రచారం

సాక్షి, హైదరాబాద్‌: డప్పు వాయిద్యాల దండు ముందు నడుస్తుండగా వెనుక అభ్యర్థి, ఆయన చుట్టూ ప్రచార సామగ్రి, జెండాలు పట్టుకున్న కార్యకర్తలు.. ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మాట్లాడి, చేతిలో చేయి వేసి ఓటడిగి, కుదిరితే అలయ్‌బలయ్‌.. ఎన్నికల ప్రచారమనగానే కొన్నేళ్ల వరకు కనిపించిన దృశ్యమిదీ. పల్లెలు, పట్టణాల్లో ఇదే తరహాలో జరిగేది. కానీ ఇప్పుడు ప్రచారం తీరు మారింది. ఇంటింటి ప్రచారం దాదాపు కనుమరుగవుతోంది. ప్రచారం చేసే అభ్యర్థులను ఇంటి ముందుకొచ్చి చూసే జనం కరువవుతున్నారు. మైకు సౌండు వినిపించగానే తలుపులేసి లోపలే కూర్చుంటున్నారు. ఇక ప్రచారంతో తమకేం సంబంధం లేదన్నట్లు అపార్టుమెంట్‌వాసులు పనుల్లో బిజీ అయిపోతున్నారు. వాల్‌ పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు, గోడలపై రాతలు, జేబులకు బ్యాడ్జీలు.. మాయమైపోతున్నట్టుగానే, ఇప్పుడు పాదయాత్రలు, కార్నర్‌ మీటింగులు కూడా పలచబడిపోయాయి.

సోషల్‌ ప్రచారమే మేలు..
నేరుగా జనాన్ని కలిసి ఓటు అడిగే పరిస్థితి భాగ్యనగరంలోని కాలనీల్లో దాదాపు కనుమరుగైంది. అభ్యర్థి పాదయాత్రతో వస్తే చూసే జనమే లేకుండా పోవటంతో వారు తీరు మార్చుకోక తప్పలేదు. తలుపులేసినా సరే,  సూది పట్టే కన్నం లేకున్నా సరే ఎంచక్కా చెప్పాలనుకున్న విషయాలను వారి ఫోన్లలో కనిపించే అవకాశాన్ని సోషల్‌ మీడియా ఇవ్వటంతో నేతలు దాన్ని అనుసరిస్తున్నారు. సంప్రదాయ ప్రచారం కంటే సామాజిక మాధ్యమ ప్రచారమే ఎక్కువగా జనానికి చేరుతోందని దాదాపు తేలిపోయింది. దీంతో ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రచారం ఊపందుకుంది. 2014 సాధారణ ఎన్నికల నుంచే ఈ ట్రెండ్‌ రాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో అది మరింత ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ప్రచారం దాదాపు ప్రధాన అభ్యర్థులంతా దానిపై ఎక్కువ దృష్టి సారించారు.  

స్వోత్కర్షకే ప్రాధాన్యం..
సోషల్‌ మీడియా ప్రచారానికి ప్రధాన అభ్యర్థులంతా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరిని నెల రోజుల కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకున్నారు. ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. గతంలో ఎంపీగానో, ఎమ్మెల్యేగానో ఉన్నవారు వారి పదవీ కాలంలో చేసిన పురోగతి, ప్రజల పక్షాన చేపట్టిన కార్యక్రమాలు, ఇప్పుడు గెలిస్తే చేయబోయే పనులు, ఊరువాడా అభివృద్ధికి వేసుకున్న ప్రణాళికలు, వారు పోటీ చేస్తున్న పార్టీ ఘనత, రాజకీయ నేపథ్యం ఉన్నవారు వారి పూర్వీకులు చేసిన కా>ర్యక్రమాలు.. ఇలా వీలైనన్ని వీడియోలు రూపొందించి వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌లకు చేరవేస్తున్నారు. కొందరైతే ఏకంగా త్రీడీ చిత్రాలు రూపొందించి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైరి పక్షాలను విమర్శించేందుకు ఎక్కువగా దీన్ని వాడుకోగా, ఈసారి తమ గురించి ఎక్కువగా చెప్పుకునేందుకే ప్రాధాన్యమిస్తుండటం విశేషం.

పెద్ద నేతల సభలకే జనం
పార్టీల స్టార్‌ క్యాంపెయినర్లలో కొందరు ప్రచారానికి వస్తున్నప్పుడే జనం కదులుతున్నారు. వారు లేకుండా అభ్యర్థులు ప్రచారానికి వస్తే చూసేవాళ్లు కరవవుతున్నారు. ప్రజాకర్షక శక్తి ఉన్న కొందరు అభ్యర్థులు మినహా మిగతా వారందరూ ఇదే దుస్థితి ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో కాలనీల్లో అసలు పట్టించుకునేవారు లేకుండా పోయారు. దీంతో పాదయాత్రలు, కార్నర్‌ మీటింగులను బస్తీలకు పరిమితం చేసి మిగతా ప్రచారానికి సోషల్‌ మీడియానే నమ్ముకుంటున్నారు. స్థానికంగా ఉండే వాట్సాప్‌ గ్రూపు వివరాలు సేకరించి మరీ వీడియోలు షేర్‌ అయ్యేలా చూస్తుండటం విశేషం. అందుకే ఈసారి పెద్దగా ఎక్కడా మైకుల గోల విన్పించట్లేదు. ఇది జనానికి కొంత ఊరటే.  

– కరీంనగర్‌ నుంచి పోటీలో ఉన్న ఓ నేత సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కోసం పదిమంది సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఊరూవాడా, ఇంటింటి ప్రచారం కంటే సోషల్‌ మీడియా ప్రచారాన్నే ఆయన ఎక్కువగా నమ్ముకున్నారు. ఆయన ప్రచారానికి సంబంధించి ఫేస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు లైవ్‌ ప్రసారం అవుతుంటుంది.
– రంగారెడ్డి జిల్లా నుంచి పోటీలో ఉన్న ఓ జాతీయ పార్టీ అభ్యర్థి అడుగుతీసి అడుగేస్తే సోషల్‌మీడియాలో వార్తలు, వీడియోలో ట్రోల్‌ అవుతూనే ఉంటాయి. సామాజిక కార్యక్రమాల ద్వారా ఆయన చేసిందేంటి.. ఎంపీగా గెలిస్తే చేసేదేంటి.. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ ఘతనలు.. ఫేస్‌బుక్, వాట్సాప్‌లు కోడై కూస్తాయి. ఇందుకు ప్రత్యేక ఐటీ విభాగం తలమునకలై ఉంది.

మరిన్ని వార్తలు