ప్రచారమస్తు

5 Dec, 2018 10:17 IST|Sakshi
రోడ్‌షోలో అలీకేఫ్‌ వద్ద మాట్లాడుతున్న కేటీఆర్‌

నేటితో ర్యాలీలు, సభలు ఆఖరు

ఐదు గంటలకే అంతా సమాప్తం

మంగళవారం నగరంలో హేమాహేమీలు

రోడ్‌షోలు, సభలతో ప్రచారం

సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ముఖ్య ఘట్టానికి నేటితో తెరపడనుంది. ఇన్నాళ్లు తమ గెలుపు కోసం ప్రజాక్షేత్రంలో తలమునకలైన అభ్యర్థులు.. బుధవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఆ ప్రక్రియకు స్వస్తి చెప్పనున్నారు. చివరిరోజు ప్రధాన పార్టీలన్నీ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, సభలతో ఎన్నికల హీట్‌ను క్లైమాక్స్‌కు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. గడిచిన రెండు వారాలుగా మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత ఎన్నికల్లో గ్రేటర్‌పై అన్ని రాజకీయ పక్షాలు ప్రధాన దృష్టి సారించి అగ్రనేతలందరినీ ప్రచారపర్వంలోకి దింపాయి. పీఎం నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మొదలు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, చంద్రబాబు, శివరాజ్‌సింగ్‌ చౌహాన్, దేవేంద్ర ఫడ్ణవీస్‌లు ప్రజాకూటమి, బీజేపీ తరఫున ప్రచారం చేశారు. మేడ్చల్‌లో సోనియా, పరేడ్‌గ్రౌండ్స్‌లో కేసీఆర్, ఎల్బీస్టేడియంలో మోదీల సభలు ప్రతిష్టాత్మకంగా జరగ్గా, ఆయా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. ఆయా వేదికలుగా గ్రేటర్‌ బరిలో ఉన్న అభ్యర్థులందరూ ఒకే చోట ప్రత్యక్ష్యమయ్యారు.

ఆయా నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో కేడర్‌ను కూడా తరలించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, నఖ్వీ, నడ్డా, గోపీనాథ్‌ ముండే, నితిన్‌ గడ్కరీ తదితరులు బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయా నియోజవర్గాల్లో ప్రచారం చేశారు. సినీతారలు ఖుష్బూ, నగ్మా, విజయశాంతి, క్రికెటర్లు అజారుద్దీన్, సిద్ధూలతో పాటు కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ ఆజాద్, జైరాం రమేష్, కర్ణాటక మంత్రి శివశంకర్‌ ప్రజాకూటమి తరఫున ప్రచారం చేశారు. వీరేగాక.. కాంగ్రెస్‌కు చెందిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, వీరప్ప మొయిలీ, కర్ణాటక పీసీసీ చీఫ్‌ దినేష్‌ గుండు వంటివారు సైతం రంగంలోకి దిగారు. ఇంకా ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించిన పలువురు అక్కడ అవకాశం రాకపోవడంతో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీఫామ్‌లు తీసుకున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్‌లో బీఎస్పీ బహిరంగసభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మాయావతి హాజరైన ఆ పార్టీ అభ్యర్థులు, శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఇక అధికార టీఆర్‌ఎస్‌ విషయానికి వచ్చేసరికి ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నీతానై నడిపించారు. గ్రేటర్‌ పరిధిలోని మెజారిటీ నియోజకవర్గాల్లో ఆయనే రోడ్‌షోలు నిర్వహించి, టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కూకట్‌పల్లి నుంచి దివంగత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని టీడీపీ తరఫున బరిలో ఉండడంతో చంద్రబాబు, బాలకృష్ణలు ఆమె కోసం రోడ్‌షోలు నిర్వహించగా.. ఏపీ టీడీపీ ముఖ్యనేతలంతా ఇక్కడే మకాం వేశారు. ప్రజాకూటమి అభ్యర్థుల తరఫున చంద్రబాబు, రాహుల్‌గాంధీ, కె.నారాయణ ఒక జట్టుగా పలు నియోజకవర్గాల్లో జరిగిన రోడ్‌షోల్లో పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం నుంచి రోడ్డు షోలు, బహిరంగ సభలు, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రచారం నిచిపోనుండడంతో పాటు సోషల్‌ మీడియా మీద కూడా ఎన్నికల సంఘం నియంత్రణ విధించనుంది. బల్క్‌ ఎస్సెమ్మెస్‌లను సైతం నిషేధించనున్నారు. ఇదిలా ఉంటే ప్రచారం చివరి రోజు నగరంలో భారీ బందోబస్తుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. నగరంలో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌తో పాటు, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ బృందాలను రంగంలోకి దింపి సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపై గస్తీ, నిఘా కట్టుదిట్టం చేయనున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనులపై సత్వరం కఠిన చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక బృందాలను సిద్ధం చేసింది. గడువు తర్వాత ఏ విధంగా ప్రచారం చేసినా ఆయా అభ్యర్థులపై కేసులు నమోదు చేయాలని స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించింది. 

రోజంతా సందడే సందడి
ప్రచారానికి కొన్ని గంటలే మిగిలి ఉండడంతో మంగళవారం నగరంలో పలువురు ముఖ్య నాయకులు రోడ్‌ షోలు, సభలతో జనంలో వచ్చారు. ఏపీ, మధ్యప్రదేశ్‌ సీఎంలు చంద్రబాబు కంటోన్మెంట్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్‌లోను, మరో సీఎం శివరాజ్‌సింగ్‌ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్‌ నియోజకవర్గాల్లో పర్యటించి తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక సినీనటుడు బాలకృష్ణ కూకట్‌పల్లిలో రోడ్‌షోలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లగడపాటి పేరుతో విడుదలైన సర్వే చిలకజోస్యమని విమర్శించారు. ఈనెల 11వ తేదీ తర్వాత మిగిలేది ఒక్క కేసీఆర్‌ మాత్రమేనని, కేసీఆర్‌ ఒక్కరే పక్కా లోకల్‌ అని పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు సైతం చంద్రబాబు, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

మరిన్ని వార్తలు