అసెంబ్లీలో తురుపుముక్కలు

29 Nov, 2014 14:55 IST|Sakshi
అసెంబ్లీలో తురుపుముక్కలు

అధికారపక్షానికి అండగా హరీశ్
 సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆద్యంతం ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందనుకున్న ప్రతిసారి సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు అధికారపక్షానికి అండగా నిలిచారు. అసెంబ్లీలో అది ప్రశ్నోత్తరాల కార్యక్రమమైనా, సావధాన తీర్మానంపై చర్చ అయినా ప్రభుత్వ పక్షాన హరీశ్ తనదైన శైలిలో విపక్షాలకు సమాధానమిచ్చారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వారెందరు అన్నదానిపై వాదనలు జరుగుతున్నప్పుడు ఎంత మంది అమరులైనా ప్రభుత్వం గుర్తిస్తుందని, వారిని ఆదుకుంటుందని, విపక్ష సభ్యులు సమాచారం ఇచ్చినా తీసుకుంటామని సర్దిచెప్పారు. అసైన్డ్ భూములకు సంబంధించి ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అనర్గళంగా ప్రశ్నలు అడుగుతుంటే పీసీసీ అధ్యక్షుడు పొన్నాల అసైన్డ్ భూమి వ్యవహారాన్ని ప్రస్తావించి వారిని ఆత్మరక్షణలో పడవేశారు.
 
 అక్బర్ అదుర్స్..
 రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చెప్పిన రాజు, గాయకుడి కథ సభను ఆకట్టుకుంది. బడ్జెట్ సమావేశాల్లో పలు అంశాలమీద ఆయన కచ్చితమైన సమాచారంతో ప్రభుత్వాన్ని నిలదీయడంపై ప్రశంసలు వచ్చాయి. ఆయన మాట్లాడిన పలు సందర్భాల్లో సభ్యులు కార్యకలాపాలను ఆసక్తిగా గమనించారు. వక్ఫ్ భూములకు సంబంధించి సర్వే నంబర్లు ఉటంకిస్తూ ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారు. జూబ్లీహిల్స్ సహకార గృహ నిర్మాణ సంఘంలో అక్రమాలను ప్రస్తావించారు. తద్వారా వక్ఫ్ భూముల ఆక్రమణ, సహకార గృహ నిర్మాణ సంఘాల్లో అక్రమాలపై రెండు సభాసంఘాలు వేయడానికి  దోహదపడ్డారు. ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడే అక్బరుద్దీన్ అవకాశం దొరికినప్పుడల్లా ఆయా అంశాలపై స్పష్టమైన అవగాహనతో మాట్లాడారు.
 
 ‘భట్టి’ది గట్టి వాదనే!
 ప్రభుత్వంపై ఈగ వాలనీయవద్దన్న రీతిలో కొందరు కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తుంటే, ఆ పార్టీ శాసనసభా పక్షం కార్యదర్శి మల్లు భట్టివిక్రమార్క పద్దులపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును, ప్రభుత్వాన్ని ఏకకాలంలో అంశాల వారీ గా నిలదీసిన తీరు సభ్యులను ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి నిర్ణయాలు కొన్ని నియంతృత్వాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయంటూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి సభలో ఉండగానే ఆయన తప్పులను వరుసపెట్టి ప్రస్తావిం చారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే తరచూ లేచి గొడవ చేసే టీఆర్‌ఎస్ సభ్యులు, భట్టి మాట్లాడుతున్నంత సేపు మౌనంగా విన్నారు.
 
 చురకలు.. చప్పట్లు..!
 బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి చురకలు వేసిన తీరుకు ప్రశంసలు వచ్చాయి. రాష్ట్రంలో కోట్లాది కుటుం బాలను ఒక్క రోజున సర్వే చేసిన ప్రభుత్వం 1200 మంది అమరవీరుల వ్యవహారాన్ని ఆరు మాసాలైనా తేల్చలేకపోతోందని ఎద్దేవా చేస్తూ..అమరుల కుటుంబాల విషయంలో జాప్యం మంచిది కాదని ప్రభుత్వానికి హితవు చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు దారుణంగా ఉన్నాయంటూ వాటిని విశదీకరించి చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు