ఎన్నికల వేళ.. చిందేస్తున్న కళ

10 Nov, 2018 13:48 IST|Sakshi

కళాకారులకు భలే డిమాండ్‌

ప్రచారంలో కీలక పాత్ర

ఓటర్లను ఆకట్టుకునే పాటలు

బృందాలుగా ఏర్పాటు చేసుకుంటున్న వివిధ పార్టీల అభ్యర్థులు

ఇబ్రహీంపట్నం రూరల్‌ (రంగారెడ్డి): ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు    ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటములకు ప్రధాన భూమిక పోషించేది ప్రచార సాధనాలే. ప్రచార సాధనాల్లో అత్యంత ప్రధానమైన విభాగం కళాకారులు. ప్రస్తుతం కళాకారులకు డిమాండ్‌ ఉంది.  ప్రతి పల్లెకు ప్రచార రథం వెళ్లాలంటే అందులో డీజిల్‌ , పెట్రోల్‌ ఎంత అవసరమో ఢప్పుతో పాడిన పాటలు అంతే అవసరం. ఎన్నికల సమయంలో అభ్యర్థులకు గురించి ప్రజలకు తక్కువ సమయంలో సమాచారం చేరాలంటే పాట రూపకంగానే చేరుతుంది. పాటల పల్లకీ ద్వారానే ప్రజలు అభ్యర్థి గురించి తెలుసుకుంటున్నారు. కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకుంటూ ప్రచారాలు సాగిస్తూ అభ్యర్థుల కోసం పని చేస్తున్నారు

పాటలకు భలే క్రేజీ
అభ్యర్థి ఎవరైనా.. ఆయన పార్టీలో పని చేసిన తీరు. జీవిత చరిత్ర, రాజకీయ చరిత్ర, ప్రజల్లో పలుకుబడి, అధికార పార్టీ అయితే ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి గురించి ప్రజలతో మమేకమయ్యే తీరుపై పాటలు రాయించుకుంటున్నారు. ఒక్కో పాటకు రూ.15వేల నుంచి రూ.30 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. పాట అంటే ప్రజలను కదిలించేలా కొత్త కొత్త బాణిలతో, చరణాలు, పల్లవిలు ఆకట్టుకునే విధంగా పాడిస్తున్నారు. ప్రముఖ సినిమా, వాగ్గేయా, జానపద కళాకారులు, రచయితలతో పాటలు పాడిస్తున్నారు. వివిధ రూపాల్లో రూపొందించిన ఈ పాటలు ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. 

చేతినిండా పనే...
ఉర్రూతలూగించేలా పాటలు, ఆటలను కళలను ప్రదర్శిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి వద్ద ఎనిమిది నుంచి తొమ్మిది మంది కళాకారుల బృందం పని చేస్తోంది. వీరిలో ప్రధానంగా సింగర్, వాయిద్యాకారులు, ఆటలు ఆడే వారు ఉంటారు. పాటలు పాడే సింగర్‌ అభ్యర్థి విశిష్ఠతను వివరిస్తూ పాటను పాడిస్తారు. ప్రస్తుతం  గ్రామాల్లో ఉండే కళాకారులకు ఈ ఎన్నికల ద్వారా చేతి నిండా పని దొరుకుతుంది. ఒక్కో కళాకారునికి రోజుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఒక్కో కళ బృందంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

రికార్డింగ్‌ స్టూడియోలు కిటకిట
మధురమైన గానంతో పాటలు రికార్డింగ్‌ చేయడానికి నగరంలోని కృష్ణనగర్‌లో ఉన్నటువంటి రికార్డింగ్‌ స్టూడియోలు కిక్కిరిసిపోతున్నాయి. నెల రోజులుగా పాటలతో సందడిగా మారాయి. పాటకు రూ.40వేల నుంచి రూ. 20 వేలు తీసుకొని సీడీలు, పెన్‌డ్రైవ్‌లల్లో పాటలు వేస్తున్నారు. రోజుకు లక్షల రూపాయలు ఉపాధి పోందుతున్నారు.  

ఖర్చుకు వెనకాడని అభ్యర్థులు...
ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్రచార సాధనాలకు అభ్యర్థులు పదును పెడుతున్నారు. వాల్‌పోస్టర్లు, గోడ రాతలు, ప్లెక్సీలు నిషేధించడంతో కళాకారుల ప్రచారానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే అభ్యర్థులు ప్రచార అస్త్రాలుగా కళాకారులను వాడుకుంటున్నారు. అభ్యర్థుల ఖర్చుల్లో భాగంగానే పాటలకు సైతం ఖర్చులు వెచ్చిస్తున్నారు. కళాకారులకు రోజుకు రూ.20వేల నుంచి 30 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. నెల రోజుల ప్యాకేజీ చొప్పున లక్షల రూపాయలు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇవే కాకుండా పాటల కోసం ఒక్క పాటకు రూ.40వేల నుంచి 25 వేల వరకు వెచ్చిస్తూ ఖర్చుకు వెనకడుగు వేయడం లేదు. దీంతో  చేతి నిండా పని దోరకడంతో కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి దొరుకుతోంది
చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల కళాకారులకు చేతి నిండా పని దొరుకుతోంది. అభ్యర్థుల గెలుపోటములకు ప్రచారాలే ప్రధాన భూమిక . ఒక్క పాట వేల మందిని నిలబెట్టడానికి ఉపయోగ పడుతుంది.  ప్రజలను , ఓటర్లను పాటల ద్వారా ఆకట్టుకునే  అస్త్రం  కళాకారుడి  వద్దనే ఉంటుంది.  ప్రచార అస్త్రాల  ద్వారానే అభ్యర్థుల గెలుపు ఓటములు  ఆధారపడి  ఉండేలా  ఉన్నాయి. 
 –  రాజు, కళాకారుడు 

అభ్యర్థి ఎవరైనా వారి కోసం పాటలు రాస్తారు. కళ ప్రజల కోసం అన్నట్లుగా సరికొత్త బాణీలతో ప్రజల ముందకు వెళ్తారు.  డబ్బే ప్రధానం కాకుండా కళకు జీవం పోయడమే కళాకారుడి ప్రధాన లక్ష్యం .
–  తులసిగారి నర్సింహ, కళాకారుడు
 

మరిన్ని వార్తలు