ఆశావహుల్లో టికెట్‌ గుబులు.!  

6 Jan, 2020 09:40 IST|Sakshi

ఈ నెల 7న నోటిఫికేషన్‌

‘పుర’పోరుకు అంతాసిద్ధం

సాక్షి, ఆదిలాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగడం.. చైర్మన్‌తో పాటు వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆదిలాబాద్‌ బల్దియాలోని ఆయా వార్డుల్లో పోటీ చేయాలనుకున్న ఆశావాహుల్లో టికెట్‌ గుబులు నెలకొంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశవహులు టికెట్ల వేటలో పడ్డారు. ఒకసారి కౌన్సిలర్‌గా పనిచేస్తే లైఫ్‌ సెటిలవుతుందన్న ఆలోచనతో ఆయా పార్టీల్లోని ప్రధాన నాయకులు బరిలో నిలిచేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందుకు పార్టీలోని పెద్దలను మచ్చిక చేసుకుంటూ టికెట్‌ కోసం అర్జీ పెట్టుకుంటున్నారు. మున్సిపల్‌ పరిధిలో గత కొన్ని రోజులుగా ఈ తంతు నడుస్తున్నా.. ఇప్పుడు రిజర్వేషన్లు తేలడంతో మరింత పెరిగింది. నామినేషన్ల దాఖలుకు ఎక్కువ రోజులు సమయం లేని కారణంగా సాధ్యమైనంత త్వరగా టికెట్‌ తెచ్చుకొని క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 

అయితే పతి.. లేకుంటే సతి.. 
మున్సిపల్‌ పరిధిలోని వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో ఎవరూ పోటీ చేయాలనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. అయితే కొన్ని వార్డుల్లోని ఆశావహులకు అనుకూలంగా రిజర్వేషన్లు రాకుంటే ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన 50 శాతం రిజర్వేషన్లు వినియోగించుకొని తమ స్థానంలో భార్యలను బరిలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్న వార్డులో రిజర్వేషన్‌ అనుకూలంగా లేకుంటే పక్క వార్డులో.. భార్యను లేదా తానే నిలబడేలా నాయకులు పథకాలు రూపొందిస్తున్నారు.

ఎలాగైన ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనన్న ఆలోచనతో ఉన్న నాయకులు టికెట్‌ రాకుంటే ఏం చేయాలనే విషయమై కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గ్రామాల విలీనంతో ఈ సారి మున్సిపల్‌ పోరు తీవ్రంగా ఉండే నేపథ్యంలో పార్టీలో టికెట్‌ కోసం చివరి వరకు ప్రయత్నించినా.. రాకపోతే ఇతర పార్టీలవైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 

ఆశావహులెక్కువ.. సీట్లు తక్కువ.. 
మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది వరకు ఏ నలుగురు కలిసిన రిజర్వేషన్‌పైనే చర్చించుకోగా, ప్రస్తుతం ఖరారు కావడంతో పోటీకి సై అంటున్నారు. అయితే మున్సిపల్‌ పరిధిలో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. ఇందులో 24 వార్డుల్లో మహిళలే పోటీ చేసే విధంగా రిజర్వేషన్లు కేటాయించారు. అయితే పార్టీలో సముచిత స్థానం కలిగి ఉండి, ఆర్థికంగా బలంగా ఉన్న వారికే టికెట్‌ కేటాయింపుకు పార్టీలు మొగ్గుచూపడం సహజం. అన్ని అర్హతలు కలిగి ఉన్నా.. తమ వార్డులో అనుకూలంగా రిజర్వేషన్‌ రాకపోవడంతో కొంతమేర ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.

ఒక పార్టీ నుంచి ఒక వార్డులో ముగ్గురు లేదా నలుగురు పోటీ పడుతున్నారు. దీంతో ఆయా ప్రధాన పార్టీల నాయకత్వానికి టికెట్ల కేటాయింపు సవాల్‌గా మారింది. ఆశావహులు ఎక్కువుండడం.. సీట్లు తక్కువగా ఉండడంతో ఎవరిని బుజ్జగించాలి.. ఎవరికి నిలబెట్టాలనేది సమస్యగా మారింది. ఇదిలా ఉండగా, అనుకుంట, రాంపూర్, దస్నాపూర్, కేఆర్‌కే కాలనీ, దోబికాలనీ, దుర్గానగర్‌ తదితర శివారు గ్రామాలకు మొదటి సారిగా పట్టణ ఎన్నికలు జరుగనుండడంతో పోటీకి అందరు ఆసక్తి చూపుతున్నారు. 

చైర్మన్‌గిరిపై దృష్టి.. 
ఆదిలాబాద్‌ బల్దియా చైర్మన్‌ పదవి అందరిని ఆకర్షిస్తోంది. ఈసారి మున్సిపల్‌పై జెండా ఎగరేయడానికి ఆయా ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. మున్సిపోరు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ఇప్పటికే ఆయా పార్టీలు తమ కార్యకర్తలు, ఇన్‌చార్జిలు, నాయకులు, ఆశావహులతో సభలు, సమావేశాలు నిర్వహించాయి. టికెట్‌ రాని వారు నిరుత్సాహ పడొద్దని.. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చాయి. అయితే చైర్మన్‌ రిజర్వేషన్‌ జనరల్‌ మహిళకు ఖరారు కావడంతో తమ పార్టీలో ఎవరున్నారనే దానిపై ఆయా పార్టీల నాయకులు ఆరా తీస్తున్నారు. ఎలాగైన చైర్మన్‌ పీఠం దక్కించుకోవాలని ఎత్తులు వేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు