నేడు బంద్

12 Jul, 2014 05:03 IST|Sakshi
నేడు బంద్

- టీజేఏసీ, వామపక్షాల పిలుపు
- సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీఆర్‌ఎస్
- పార్లమెంట్‌లో పోలవరం ఆర్డినెన్స్
- ఆమోదంపై ఎగిసిన నిరసన జ్వాల

 వరంగల్ : పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర ప్రాంతంలో కలుపుతూ పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్విజన బిల్లులో చేసిన సవరణలకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ జేఏసీ, వామపక్షాలు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తీవ్రంగావ్యతిరేకించాలని కోరారు. ఈ మేరకు జిల్లాలో శుక్రవారం తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆంధ్ర పాలకుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత దొడ్డిదారిలో సవరణకు ఆర్డినెన్స్ తెచ్చి కుట్రలు చేసిందని దుయ్యబట్టారు.

స్థానిక ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, పోరుబాట పట్టి కేంద్ర మెడలు వంచుతామన్నారు. నేటి బంద్‌కు ఆర్టీసీ, వ్యాపార వాణిజ్యవర్గాలు, విద్యాసంస్థలు, ప్రజలు సహకరించాలని కోరారు. బంద్‌ను జయప్రదం చేసి కేంద్రానికి కనువిప్పు కలిగించాలని తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్, ప్రొఫెసర్ పాపిరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు చంద్రన్న, మండల వెంకన్న, సీపీఎం నగర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ పంచాయత్‌రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాదుల ప్రసాద్ తదితరులు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
 
టీడీపీ నేతలు వైఖరి స్పష్టం చేయాలి : తక్కళ్లపల్లి
పోలవరం ఆరినెన్స్‌పై తెలంగాణ తెలుగుదేశం నాయకులు తమ వైఖరిని స్పష్టం చేయాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడి ఒత్తిడితోనే కేంద్రప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చిందన్నారు. ముంపు గ్రామాలను ఏపీలో కలుపుతూ కేంద్రం తెచ్చిన అక్రమ ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ న్యాయపోరాటం చేస్తుందన్నారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతారో... తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తారో స్పష్టం చేయాలని టీ టీడీపీ నేతలను నిలదీశారు. అదేవిధంగా బీజేపీ నాయకులు తమ పార్టీపై ఒత్తిడి చేసి ఆర్డినెన్స్‌ను రద్దు చేయించి గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన కోరారు.
 
చంద్రబాబు ఏం చెబుతారు..
 ఆంధ్ర ప్రాంతానికి ఎన్డీయే ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తోందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శించారు.  హన్మకొండలోని ఆమె నివాసంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీఆర్‌ఎస్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు అడ్డుకున్నా టీ టీడీపీ, బీజేపీ ఎంపీలు అడ్డుకోకుండా ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ విప్‌జారీ చేసి మరీ బిల్లుకు మద్దతు ప్రకటించారని ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు తనకు సమానమంటూ చెప్పే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు.
 
14, 15న కోర్టు విధుల బహిష్కరణ
వరంగల్ లీగల్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీపై యథాతథ స్థితి (స్టెటస్‌కో) కొనసాగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా, పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ పిలుపుమేరకు ఈ నెల 14,15న విధులు బహిష్కరించనున్నట్లు బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర్ర పభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తూ గిరిజన ప్రజలపై కక్షసాధించే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ముంపు గ్రామాలను కల్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. 14న జిల్లా కోర్టు ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని, 15న జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు న్యాయవాదుల ర్యాలీ ఉంటుందని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు