అశ్వాపురం, నెల్లిపాకల్లో ఏకగ్రీవాల హవా..

14 Feb, 2020 09:43 IST|Sakshi

సాక్షి, అశ్వాపురం: ఏళ్లు కాదు..దశాబ్దాల చరిత్ర ఉన్న ఆ సంఘాల్లో ప్రతిసారీ తీవ్ర పోటీనే. కానీ..ఈసారి ఏకగ్రీవమై ప్రత్యేకత సంతరించుకున్నాయి. అవే..అశ్వాపురం, నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. 1957లో ఏర్పాటైన ఈ రెండు సహకార సంఘాల్లో గత ఎన్నికల వరకు హోరాహోరీ పోరు ఉండేది. ఈ సారి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఏకగ్రీవమయ్యేట్లు చూశారు.

జిల్లాలోని 20 సహకార సంఘాల్లో 13కు 13 వార్డులు ఏకగ్రీవమైన సంఘాలుగా అశ్వాపురం, నెల్లిపాక సహకార సంఘాలు నిలిచాయి. ఈ రెండు సంఘాల అధ్యక్షులుగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఎన్నిక కానున్నారు. అశ్వాపురం పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా తుళ్లూరి బ్రహ్మయ్య మూడో సారి ఎన్నిక కానున్నారు. నెల్లిపాక పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా తుక్కని మధుసూదన్‌ రెడ్డి ఎన్నిక కానున్నారు. 

గతంలో బ్రహ్మయ్య డీసీసీబీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. గత ఎన్నికల్లో అశ్వాపురం పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికై డీసీసీబీ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్‌ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలోనే అశ్వాపురం, నెల్లిపాక సహకార సంఘాలు ఏకగగ్రీవమయ్యేలా రాజకీయ పార్టీలను ఒప్పించి మండల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. జిల్లాలోని సహకార సంఘాల్లో అశ్వాపురం, నెల్లిపాక సొసైటీలకు ప్రత్యేక స్థానం ఉంది. 3,232 మంది సభ్యులతో ఏడాదికి రూ.10 కోట్ల టర్నోవర్‌తో అశ్వాపురం పీఏసీఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నెల్లిపాక పీఏసీఎస్‌కి జిల్లాలోని మొదటి మూడు సహకార సంఘాల్లో ఒకటిగా ఉంటు పలుమార్లు ఉత్తమ సంఘంగా అవార్డు పొందింది. 

మరిన్ని వార్తలు