నాటినుంచి.. నేటికి ‘కోదాడ’!

4 Jan, 2020 09:10 IST|Sakshi

సాక్షి, కోదాడ : నియోజకవర్గ కేంద్రమైన కోదాడను 1952లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీనికి తొలి సర్పంచ్‌గా మర్ల పానకాలయ్య, ఉపసర్పంచ్‌గా కాకుమాను నర్సింహారెడ్డి, కార్యదర్శిగా గుడుగుంట్ల చిన అప్పయ్య వ్యవహరించారు. నాడు పంచాయతీలో నాలుగు వేల మంది జనాభా, మూడు వేల ఓటర్లు ఉండగా ఆదాయం  రూ.రెండు వేలుగా ఉండేది. 1956 నుంచి 64 వరకు తమ్మర వెంకటేశ్వరరావు సర్పంచ్‌గా ఉన్నారు. ఆ తరువాత చినఅప్పయ్య 1965 నుంచి 1971 మార్చి వరకు సర్పంచ్‌గా పని చేశారు. 1971 మార్చి నుంచి 72 మార్చి వరకు గరిడేపల్లి స్వామి, 1972 నుంచి 81 వరకు దాదాపు 10 సంవత్సరాలు వెలిశాల అనంతరామయ్య సర్పంచ్‌గా పనిచేశారు, 1981లో జరిగిన ఎన్నికల్లో వేనేపల్లి చందర్‌రావు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

1984 జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన కోదాడ ఎమ్మెల్యేగా వెళ్లడంతో అప్పటి ఉప సర్పంచ్‌ చిట్టాబత్తిని సుబ్బరామయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆయన తరువాత సత్యబాబు, ఎర్నేని బాబు, పారా సీతయ్య, ఏర్నేని కుసుమ పని చేశారు. ఉపసర్పంచ్‌గా ఉన్న వాడపల్లి వెంకటేశ్వర్లు రెండుసార్లు ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌గా పని చేశారు. 2012 వరకు కోదాడ గ్రామపంచాయతీగా కొనసాగింది. ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించి ప్రత్యేక అధికారిని నియమించింది. 2014లో మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడంతో టీడీపీ–కాంగ్రెస్‌ ముఖాముఖి తలపడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వంటిపులి అనిత మొదటి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికై 2019 వరకు కొనసాగారు.

పెరిగిన వార్డులు..
మేజర్‌ పంచాయతీగా ఉన్న కోదాడను 2012లో ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. దీనికి తొలిసారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండేవి. తాజాగా శివారు గ్రామాలైన తమ్మర, కొమరబండ కోదాడ మున్సిపాలిటీలో కలవడంతో వార్డుల సంఖ్య 35కు పెరిగింది. ప్రస్తుతం 75 వేల జనాభా 53,898 మంది ఓటర్లు ఉన్నారు.  

మరిన్ని వార్తలు