‘నమోదు’పై నజర్‌

22 Sep, 2018 11:14 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పక్షాలు దృష్టి పెట్టాయి. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవడం.. అలాగే జాబితాలో తమకున్న అభ్యంతరాలపై దృష్టి సారించాయి. మరోవైపు జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకుని.. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లావ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం విస్తృతంగా నిర్వహిస్తోంది. ఇక పలు రాజకీయ పక్షాలు వచ్చే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారిని ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించడంతోపాటు అనేక చోట్ల వారికి ఓటు నమోదు చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తున్నాయి. వీటితోపాటు ఓటరు జాబితాలో ఇబ్బడి ముబ్బడిగా పేర్లు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్న రాజకీయ పక్షాలు వాటిపై సైతం దృష్టి సారించాయి.

ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలిస్తూ.. ఒకే ప్రాంతంలో రెండుసార్లు ఓటర్లుగా నమోదైన వారి పేర్లు, మరణించినా జాబితాలో ఉన్న వారి పేరు, ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఇంకా ఆయా ప్రాంతాల్లో ఓటర్లుగా కొనసాగుతున్న వారి పేర్లను క్షేత్రస్థాయిలో సేకరించే పనిలో ఆయా రాజకీయ పక్షాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు కొత్త ఓటరుగా నమోదు చేసుకునే వారికి అందుబాటులో ఉండేందుకు ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ బూత్‌ లెవల్‌ అధికారులను అందుబాటులో ఉంచగా.. ఆన్‌లైన్‌లోనూ ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు.. మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జిల్లాలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ప్రయత్నం చేసిన కొత్త ఓటర్లకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న విమర్శలు తప్పడం లేదు. ఓటరు నమోదుకు సంబంధించి అన్ని వివరాలను పూర్తి చేసి.. సబ్మి ట్‌ చేసేందుకు ప్రయత్నించగా.. ఆన్‌లైన్‌లో తిరస్కరణ అని వస్తున్నట్లు పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఆయా బూత్‌ పరిధిలోని బూత్‌ లెవల్‌ అధికారుల వద్ద నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.  

పార్టీల దృష్టి.. 
ఇక జిల్లాలోని ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ, న్యూడెమోక్రసీ వంటి పార్టీలు ఓటర్ల నమోదు, అలాగే నమోదు జరుగుతున్న తీరుపై దృష్టి పెట్టాయి. ఓటర్ల జాబితాలో తమ తమ పార్టీలు, ప్రాంతాలకు సంబంధించి పేర్ల తొలగింపు.. మరణించిన ఓటర్ల పేర్లు తొలగించారా? లేదా? చిరునామాల మార్పు సక్రమంగా జరుగుతుందా? లేదా? అన్న అంశంపై పూర్తిస్థాయి దృష్టి సారించే పనిలో నిమగ్నమయ్యాయి. ఓటర్ల మార్పులు, చేర్పులు, ఓటర్ల నమోదుకు సంబంధించి ఈనెల 25వ తేదీ వరకే గడువు ఉండడంతో జిల్లాలోని అన్ని రాజకీయ పక్షాలను రాష్ట్రస్థాయి నాయకత్వాలు అప్రమత్తం చేశాయి. ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించే వారికి అవగాహన కల్పించడంతోపాటు ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయా రాజకీయ పక్షాలు నిర్ణయించడంతో జిల్లా, మండల స్థాయిలోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

ఇప్పటికే ఓటరు నమోదు, జాబితాకు సంబంధించి కలెక్టర్‌ కర్ణన్‌ రాజకీయ పక్షాలతో పలుమార్లు సమావేశం నిర్వహించడంతోపాటు ఓటర్ల జాబితాకు సంబం ధించి సలహాలు, సూచనలను కోరారు. రాజకీయ పార్టీలు అందించిన సలహాలు, సూచనలను సైతం పరిగణనలోకి తీసుకుని కొత్త ఓటర్ల నమోదు, జాబితాను పూర్తి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించినా.. అందుకు తగిన విధంగా జిల్లా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు, కొత్త ఈవీఎంలను తేవడంతోపాటు వివిధ స్థాయిల్లో అధికారులు నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లాకు చెందిన ఐదుగురు అధికారులు ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ నిర్వ హించే శిక్షణ కార్యక్రమానికి దశలవారీగా వెళ్లనున్నారు. వారు జిల్లాస్థాయిలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు అవగాహన కల్పించనున్నారు. ఇక రాజకీయ పక్షాలు సైతం పోలింగ్‌ బూత్‌ల స్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేసి.. వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా.. ఎన్నికలకు ప్రధానమైన ఓటర్ల జాబితాపై ఈసారి అన్ని రాజకీయ పక్షాలు దృష్టి సారించడం విశేషం.

మరిన్ని వార్తలు