12  ‘పురా’లు.. 76 నామినేషన్లు 

9 Jan, 2020 09:09 IST|Sakshi
ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్‌ 47వ వార్డులో రోటీ చేస్తున్న మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి

మున్సిపాలిటీల్లో కీలకఘట్టం షురూ..  మొదలైన నామినేషన్ల ప్రక్రియ 

కొల్లాపూర్, వనపర్తిలో అత్యధికంగా 14 చొప్పున దాఖలు

పెబ్బేరు, అలంపూర్, భూత్పూర్, వడ్డేపల్లి, అమరచింతలో బోణి కాని వైనం

ముహూర్తం బాగోలేకపోవడంతో ముందుకు రాని అభ్యర్థులు

రేపటి వరకు గడువు.. చివరిరోజు పోటెత్తే అవకాశం

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. బుధవారం ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరిగే 17 మున్సిపాలిటీల్లో 76 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు తమతమ నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో కొల్లాపూర్, వనపర్తి మున్సిపాలిటీల్లో అత్యధికంగా 14 నామినేషన్లు దాఖలు కాగా అమరచింత, అలంపూర్, పెబ్బేరు, భూత్పూరు. వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో బోణి జరగలేదు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అత్యధికంగా 26 నామినేషన్లు దాఖలు కాగా, బీజేపీ నుంచి 19, కాంగ్రెస్‌ నుంచి 16, ఆలిండియా ఫార్వడ్‌ బ్లాక్‌ నుంచి ఏడు, స్వతంత్రులు ఆరుగురు, టీడీపీ నుంచి ఇద్దరి చొప్పున మొత్తం 76 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఆత్మకూరు మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి గాయత్రి రవికుమార్‌ యాదవ్‌ రెండో వార్డు నుంచి నామినేషన్లు వేశారు. నారాయణపేట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నందు నామాజీ బీజేపీ తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. కొల్లాపూర్‌ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు ఆలిండియా ఫార్వడ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి ఏడు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు ఈ నెల పదో తేదీ వరకు ఉంది. 

గురువారం రెండోరోజు కూడా నామినేషన్ల దాఖ లుకు అభ్యర్థులు ముందుకురాని పరిస్థితి కనబడుతోంది. శుక్రవారం మంచి ముహూర్తం కావడం.. అదే ఆఖరి రోజు కావడంతో ఆశావహు లు, అభ్యర్థులందరూ భారీ మొత్తంలో నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అన్ని మున్సిపాలిటీల్లోనూ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఎన్నికలు జరుగుతున్న 17 మున్సిపాలిటీల్లో మొత్తం 338 వార్డులు ఉండగా.. ఈ సారి భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. నామినేషన్‌ దాఖలు చేసిన సాధారణ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1,250 నగదును డిపాజిట్‌ రూపంలో చెల్లించారు. నేరప్రవృత్తి లేదని నిరూపిస్తూ డిక్లరేషన్, మున్సిపాలిటీకి, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఎలాంటి బకాయిలు లేవంటూ మున్సిపాలిటీ నుంచి తీసుకున్న ఎన్‌ఓసీలు నామినేషన్‌ వెంట జత చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉమ్మడి జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికల అధికారులుగా.. ఆయా మున్సిపల్‌ కమిషనర్లు సహాయ ఎన్ని కల అధికారులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తొలి రోజు జిల్లా కలెక్టర్లందరూ తమ తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో నామినేషన్‌ కేంద్రాలకు వెళ్లి ప్రక్రియను పరిశీలించారు. వీరితో పాటు నామినేషన్ల స్వీకరణకు అన్ని మున్సిపాలిటీల్లో నియమించిన రిటర్నింగ్‌ అధికారులకు తగిన సలహాలు సూచనలు అందజేశారు. వీరితో పాటు ఎన్నికల కమిషన్‌ నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు సైతం పలు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియపై ఆరా తీశారు. మహబూబ్‌నగర్, భూ త్పూర్‌ మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియను జిల్లా పరిశీలకురాలు పౌసమి బాసు పర్యవేక్షించారు. సీసీ కెమెరాల నిఘా నీడలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. 

హామీ తర్వాతే నామినేషన్‌.. 
అభ్యర్థిత్వాల ఖరారులో ప్రధాన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ తర్జనభర్జన పడుతున్న నేపథ్యంలో తమకు పోటీ చేసే అవకాశం వస్తుందో రాదో అనే ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. ఈ క్రమంలో బుధవారం చాలా మంది టికెట్ల కోసం తమ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. అయితే.. ఇప్పటికే అభ్యర్థిత్వాల ఖరారులో టీఆర్‌ఎస్‌ కాస్త ముందంజలో ఉన్నా.. పలు మున్సిపాలిటీల్లో ఆశావహులకు టికెట్లపై పూర్తి స్ధాయిలో భరోసా కల్పించలేకపోతోంది.

ఇటు కాంగ్రెస్, బీజేపీలో పలు మున్సిపాలిటీల్లో అభ్యర్థులు సైతం కరువయ్యారు. అయితే పోటీ ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఒక్కో వార్డుకు నాలుగైదు దరఖాస్తులు రావడంతో ఆశావహులు ఆయా పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రు. మరోవైపు గడువు కూడా దగ్గర పడడంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు నామినేషన్లు దాఖలు చేసుకోవాలని ఇప్పటికే అనేక మంది ఆశావహులకు అనధికారికంగా తెలియజేశారు.

ఇదీలా ఉంటే గురువారం దాదాపు అన్ని పార్టీల్లో అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశాలున్నాయి. కానీ ఈ నెల 14 సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండడం.. ఆ లోగా బీఫాంలు ఇవ్వొచ్చన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు అన్ని పార్టీలు అప్పటి వరకు బీఫాంలు ఇవ్వా లని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  మరోవైపు ప్రధానపార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు. బుధవారం బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు