చలో.. సోషల్

24 Nov, 2018 10:10 IST|Sakshi

ఊపందుకున్న సోషల్‌ మీడియా ప్రచారం  

ఈ–ప్రచారానికి అభ్యర్థుల ప్రాధాన్యం  

ఏకంగా కార్యాలయాల ఏర్పాటు  

ఫేస్‌బుక్, వాట్సప్, ట్వీటర్‌లలో ఎన్నికల జోరు  

వేలాదిగా ఫాలోవర్లు.. లైక్‌లు, కామెంట్లు  

సాక్షి, సిటీబ్యూరో: ప్రచారపర్వం కొత్తపుంతలు తొక్కుతోంది. సోషల్‌ మీడియా వేదికగా స్పీడుగా సాగుతోంది. నెటిజనులైన సిటీజనుల పల్స్‌ పట్టుకునేందుకు అభ్యర్థులు ఈ–ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయడం విశేషం. ప్రత్యర్థుల వైఫల్యాలు, నేర చరిత్ర, ఉల్లంఘనలు తదితర ఏదైనా తమ మైలేజీకి ఉపయోగపడే ప్రతి అంశాన్నీ అన్ని పార్టీల అభ్యర్థులు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా పత్రికల కథనాలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్స్‌ ఇప్పుడు నెట్టింట్లో మార్మోగుతున్నాయి. ఈ–పోస్టింగ్‌లకు ఆయా పార్టీల అభిమానులు, సానుభూతిపరులు లైక్‌లు, కామెంట్లు విసురుతున్నారు. నయాగా ఏర్పడిన సోషల్‌ గ్రూపులకు ఫాలోవర్లు కూడా వేలాదిగానే ఉన్నారు. గ్రేటర్‌లో సుమారు 76లక్షల మంది ఓటర్లుండగా.. ప్రతి ఎన్నికలోనూ ఓటింగ్‌ శాతం 55శాతం మించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈసారైనా సిటీజనులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థులు సోషల్‌ మీడియాఅభ్యర్థిస్తుండడం విశేషం.   

సరికొత్త వ్యూహం..
బస్తీ బాట, పాదయాత్ర, కాలనీ సంఘాలతో మాటాముచ్చట, బైక్‌ ర్యాలీలు, ప్రచార రథాల జోరు, ఎన్నికల మీటింగ్‌లు, హామీల వర్షం, వినూత్న పాటలతో హోరెత్తే ఎలక్షన్‌ లొల్లి... ఇప్పుడు హైటెక్‌ బాట పట్టింది. సామాజిక మాధ్యమాల్లో వినూత్న ప్రచారానికి తెరలేచింది. ఇందులో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర మరింత ముందున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి సమానంగా సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా, ఐటీ నిపుణులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకున్నారు. శాయశక్తులా పనిచేసి సిటీలోని నెటిజన్లను తమవైపు తిప్పాలని కోరుతున్నారు. ఈ సోషల్‌ ప్రచారకర్తలకు వేతనాలు, గిఫ్ట్‌లు తదితర నజరానాలు భారీగానే ముట్టజెప్పుతున్నారు. గల్లీలు, కాలనీలు, బస్తీలు ఇలా కాదేదీ సోషల్‌ ప్రచారానికి అడ్డు అన్న రీతిలో ఎక్కడ వీలైతే అక్కడ చిన్న దుకాణాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లు, ఇండిపెండెంట్‌ ఇళ్లలోనూ అద్దె ప్రాతిపదికన ఓ పోర్షన్‌ను తీసుకొని తాత్కాలిక సోషల్‌ మీడియా క్యాంపెయినింగ్‌ కార్యాలయాలను సైతం ఏర్పాటు చేయడం విశేషం. ఈ–ప్రచారానికి అవసరమైన ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు, వైఫై కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు తదితర సరంజామా భారీగానే సమకూర్చారు. తాజాగా ఇంజినీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసిన నిరుద్యోగులు, సాంకేతిక నిపుణులు, చిరుద్యోగుల సేవలను సోషల్‌ మీడియా ప్రచారానికి వినియోగించుకుంటున్నారు.  

పంచ్‌ పడాలి..
‘నేనొక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టు’ అనే సినిమా డైలాగ్‌ను ఒంటబట్టించుకున్న సోషల్‌ ప్రచారకర్తలు ప్రధానంగా ఒక్కో పంచ్‌ డైలాగ్, కార్టూన్, క్యారికేచర్, విమర్శ, ప్రతి విమర్శలను నిత్యం వందలాది వాట్సప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌ సమూహాలకు చేరవేస్తున్నారు. ఈ–ప్రచారంలో ఇతివృత్తాలు సైతం ఆసక్తికరంగానే ఉన్నాయి.  రోజువారీగా పత్రికలు, టీవీల్లో ప్రధాన పార్టీల నేతలు, అధినేతలు మాట్లాడిన మాటలు, చమక్కులు, విపక్ష పార్టీలపై చేస్తున్న ఘాటైన వ్యాఖ్యలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇస్తున్న హామీలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు? వాటి అమలు తీరు ఎలా ఉంది? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వాటి లబ్ధిదారులు, లబ్ధిపొందనివారు, ఉద్యోగాల భర్తీ, పింఛన్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధు పథకాలు సహా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, స్కామ్‌లు... ఇలా ఒక్కటేమిటి ప్రతి అంశం సోషల్‌ మీడియాలో ప్రచార అస్త్రంగానే మారుతోంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఒక్కరి చేతిలో దర్శనమిస్తుండడంతో సోషల్‌ మీడియా ప్రచారానికి స్పందన కూడా పెరుగుతుండడం విశేషం. తమకు నచ్చిన కామెంట్‌/కార్టూన్‌/క్యారికేచర్‌/విమర్శ, ప్రశంసలకు లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోందని సోషల్‌ ప్రచారకర్తలు పేర్కొంటున్నారు.  

గ్రేటర్‌లోని వివిధ నియోజకవర్గాల్లోఇప్పటికే సోషల్‌ మీడియాక్యాంపెయినింగ్‌ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ జాబితాలో ఎల్బీనగర్, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్,నాంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, ముషీరాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్‌ తదితర నియోజకవర్గాలు ఉన్నాయి.ఆయా నియోజకవర్గాల్లో అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం రెండూ పోటాపోటీగా ఈ–ప్రచారం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు