ఆర్టీసీ చుట్టూ..  రాజకీయం!

20 Oct, 2019 08:57 IST|Sakshi
ఆర్టీసీ కార్మికుల ధర్నాలో పాల్గొన్న బీజేపీ నాయకులు (ఫైల్‌)  

ఆర్టీసీ సమ్మెకు అఖిలపక్షం మద్దతు

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 15 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు టీఆర్‌ఎస్, ఎంఐఎం తప్పా మిగతా రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. కార్మికులతో కలిసి పోరుబాట పట్టాయి. ఎక్కడికక్కడ ప్రతిరోజూ డిపోల వద్ద ధర్నాలు.. రాస్తారోకోలు.. వినూత్న నిరసనలు.. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల అందజేతలో చురుగ్గా పాల్గొంటున్నాయి.

ముఖ్యంగా కార్మికుల సమ్మెపై స్పందించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశాయి. వారం రోజులుగా కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులు, శ్రేణులు పాల్గొనడంతో సమ్మె ఉధృతంగా మారింది. ఇప్పటికే పట్టణాలు, మండలాల్లో నిర్వహిస్తున్న ఆందోళనల్లో ఆయా పార్టీల నేతలు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు.. కార్యక్రమాలపై స్పందించే అఖిలపక్ష నేతలకు ఆర్టీసీ కార్మికుల సమ్మె కలిసొచ్చింది.

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇంత పెద్దస్థాయిలో ఉధృతంగా ఈ ఉద్యమం కొనసాగుతుండటం.. అన్ని వర్గాలు, సంఘాలు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడటంతో రాజకీయ పార్టీలు సైతం తమ ఉనికిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సుమారు ఐదు వేల కుటుంబాలతో ముడిపడి ఉన్న ఈ సమ్మెలో పాల్గొనడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నామనే భరోసాను కల్పిస్తున్నాయి. ఈ పార్టీల మద్దతును చూసి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు సైతం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని చేపట్టాయి. బీజేపీ తరఫున జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సీపీఐ తరఫున పార్టీ జిల్లా కార్యదర్శి పరమేశ్‌గౌడ్, సీఐటీయూ నాయకుడు కె.చంద్రకాంత్‌ ఆధ్వర్యంలో ఆయా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో డోకూరి పవన్‌కుమార్‌ (బీజేపీ), జి.మధుసూధన్‌రెడ్డి (కాంగ్రెస్‌), సీహెచ్‌ రాంచందర్‌ (సీపీఐఎంఎల్‌–న్యూడెమోక్రసీ), వేణుగోపాల్‌ (సీపీఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో బాలవర్ధన్‌గౌడ్‌ (కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ రాష్ట్ర నాయకుడు), రాంమోహన్‌ (బీజేపీ), దీప్లానాయక్‌ (సీపీఎం), జగన్‌ (కేవీపీఎస్‌) ఆధ్వర్యంలో ఆయా పార్టీ కార్యకర్తలు కార్మికులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

వనపర్తి జిల్లాలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బి.రాములు, బిజేపి జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎంఏ జబ్బార్, సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్రయ్య, బిఎస్పీ రాష్ట్ర నాయకులు సత్యంసాగర్‌ల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కార్మికులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జోగుళాంబ గద్వాల నియోజకవర్గ పరిధిలో డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, గడ్డం కృష్ణారెడ్డి (బీజేపీ), గంజిపేట రాములు (టీడీపీ) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలో సదానందమూర్తి (కాంగ్రెస్‌), తుమ్మల రవికుమార్‌ (బీజేపీ), రాజు, రేపల్లి దాసు (సీపీఎం), పెద్దబాబు (సీపీఐ) ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆందోళన చేపడుతున్నారు. 

నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ పరిధిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రమేశ్, సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాల నర్సింహ, వెంకట్రాములు (కాంగ్రెస్‌), శ్యాంప్రసాద్‌రెడ్డి (టీజేఎస్‌) ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఆనంద్‌కుమార్‌ (కాంగ్రెస్‌), రాఘవేందర్‌ (బీజేపీ), ఆంజనేయులు (సీపీఎం), పరశురాం (సీపీఐ), కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలో టీపీసీసీ కార్యదర్శులు జగన్మోహన్‌రెడ్డి, జగదీశ్వరుడు; శేఖర్‌గౌడ్‌ (బీజేపీ), రామస్వామియాదవ్‌ (టీడీపీ), ఫయాజ్‌అహ్మద్‌ (సీపీఐ), శివశర్మ (సీపీఎం), అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో డాక్టర్‌ వంశీకృష్ణ (కాంగ్రెస్‌), మండిగారి బాలాజీ, మంగ్యానాయక్‌ (బీజేపీ), మోపతయ్య (టీడీపీ), ఎల్‌.దాస్యానాయక్‌ (సీపీఎం) ఆధ్వర్యంలో ఆయా పార్టీల కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు.

నారాయణపేట నియోజకవర్గ పరిధిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామోజీ, బండి వేణుగోపాల్‌ (కాంగ్రెస్‌), వెంకట్రాంరెడ్డి (సీపీఎం), బి.రాము (సీపీఐ), ఓంప్రకాశ్‌ (టీడీపీ) ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మక్తల్‌ నియోజకవర్గ పరిధిలో బీజేపీ రాష్ట్ర సంపర్క్‌ అభియాన్‌ చైర్మన్‌ కొండయ్య, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ శ్రీహరి, కొండన్న (సీసీఐ), భగవత్‌ (సీపీఎం) ఆధ్వర్యంలో ఆయా పార్టీల కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు