తర్జన.. భర్జన

12 Mar, 2014 01:32 IST|Sakshi
తర్జన.. భర్జన

 ఉత్కంఠగా ‘పుర’పోరు
 అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీల కసరత్తు
 మెజార్టీ స్థానాలు లక్ష్యంగా నేతల పావులు
 రెండు రోజుల్లో ముగియనున్న నామినేషన్లు

 
 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
 ‘పుర’పోరుపై జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల కసరత్తు సాగుతోంది. మెజార్టీ స్థానాలు లక్ష్యంగా గెలుపు గుర్రాల వేటలో పడిన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జన భర్జన పడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల మధ్యన పొత్తులుంటాయన్న సస్పెన్స్‌కు ఇంకా తెరపడక పోగా... మేయర్, చైర్మన్ల అభ్యర్థులు ఖరారు కాక పురపోరు ఉత్కంఠభరితంగా మారింది. నిజామాబాద్ పురపాలక సంస్థతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా రెండో రోజైన మంగళవారం నాటికి మొత్తం నామినేషన్ల సంఖ్య 82కు చేరింది.
 
 రెండు రోజుల్లో..
 నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలకు రెండు రోజు ల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. కార్పొరేషన్ కు 13, మున్సిపాలిటీల్లో 14 తేదీలు నామినేషన్లకు చివరి రోజు కాగా, మేయర్, మున్సిపల్ అభ్యర్థుల ను ప్రధాన పార్టీలు ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల మధ్యన పొత్తులు ఉంటాయన్న ప్రచారానికి ఆ పార్టీ నాయకుడు హరీష్‌రావు మంగళవారం తెర వేశారు. స్థానిక సంస్థల వరకైతే పొత్తు లు లేనట్లేనని ఆయన ఓ ప్రకటన చేశారు. బీజేపీ, టీడీపీల పొత్తుల వ్యవహారం కూడా ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్‌ఆర్ సీపీ, సీపీఐ తదితర పార్టీలు నగర, మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సమాయత్తం అయ్యాయి.ఆయా పార్టీలకు చెందిన ‘బి’ఫారములు అందనప్పటికీ ఆశావహులు మాత్రం సోమవారం నుంచి నామినేషన్లు వేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 59, కామారెడ్డి మున్సిపాలిటీలో 13, బోధన్‌లో 3, ఆర్మూరులో 7నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే మరో రెం డు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ముగియనుండగా, ఈ లోపే అభ్యర్థుల జాబితా, ‘బి’ఫారాలను అందజేసేందుకు చేస్తున్న కసరత్తుపై ఉత్కంఠ నెలకొంది.
 
 అభ్యర్థుల ఎంపికపై..
 కార్పొరేషన్, మున్సిపాలిటీల అభ్యర్థులపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ సీపీలు కసరత్తు చేస్తుండగా.. టీడీపీ వలసలను అడ్డుకోవడంలో తలమునకలవుతోంది. మేయర్, చైర్మన్ల అభ్యర్థిత్వాలపై తర్జన భర్జనలు పడుతుండగా సీనియర్ టీడీపీ, నగర అధ్యక్షుడు సూర్యవంశి అంబాదాస్ మంగళవారం బీజేపీలో చేరి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్, కార్పొరేటర్లపై కసరత్తు చేసేందుకు పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ నిజామాబాద్‌లో మకాం వేసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ స్పీక ర్ సురేశ్ రెడ్డిలు మూడు మున్సిపాలిటీల్లో అభ్యర్థులపై చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కిరాలేదు.  నిజామాబాద్ కార్పొరేషన్‌లో మొదటి విడతలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా ఎన్నికల పరిశీలకులు నాయుడు ప్రకాశ్ 18 మంది అభ్యర్థులకు ‘బి’ఫారములను అం దజేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ తదితర పార్టీలు కూడా అభ్యర్థులను బరిలో దిం పాయి. మెజార్టీ స్థానాలు లక్ష్యంగా ప్రధాన రాజకీ య పార్టీలు పావులు కదుపుతుండటం చర్చనీయాం శం అవుతోంది.

మరిన్ని వార్తలు