పొలిటికల్‌ పోలీస్‌! 

11 Nov, 2018 02:13 IST|Sakshi

టార్గెట్‌ 2024

ఇండిపెండెంట్లుగా బరిలోకి పోలీస్‌ అధికారులు 

ముగ్గురు అధికారులు ఎమ్మెల్యే.. మరో ఇద్దరు ఎంపీ స్థానాలకు.. 

ఇప్పుడు గెలవకపోయినా భవిష్యత్తు దృష్ట్యా రంగంలోకి.. 

సాక్షి, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి రాజకీయంగా అదృష్టం పరీక్షించుకునేందుకు కొంతమంది పోలీస్‌ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి కూడా అవకాశం లేకపోవడంతో ఆ అధికారులు స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు అసెంబ్లీ ఎన్నికలు కాకుండా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి లేదా వరంగల్‌ స్థానాలపై గురిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి ఆయన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారని, దీనిపై సన్నిహితులతో చర్చించారని తెలిసింది.

ఇకపోతే మరో నాన్‌కేడర్‌ ఎస్పీ సైతం పార్లమెంట్‌కు పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన కూడా వరంగల్‌ లేదా నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీచేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో కూడా ఆ అధికారి టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఓ సీనియర్‌ మంత్రి ద్వారా మంత్రాంగం నడిపినా చివరకు టికెట్‌పై హామీ రాకపోవడంతో ఉద్యోగంలో కొనసాగుతున్నారు. కానీ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించాలని, టికెట్‌ రాకపోతే మరేదైనా జాతీయ పార్టీ గుర్తుపై పోటీచేయాలని ఆయన భావిస్తున్నారు.  

అసెంబ్లీకి ముగ్గురు అధికారులు... 
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముగ్గురు రాష్ట్ర స్థాయి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓ జిల్లాలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న అధికారి మహబూబాబాద్‌ నుంచి అసెంబ్లీకి పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీనుంచి టికెట్‌కోసం తీవ్రంగా ప్రయత్నించినా పీసీసీ నుంచి పెద్దగా మద్దతు రాకపోవడంతో ఏదైనా ఓ పార్టీ నుంచి గానీ లేదా ఇండిపెండెంట్‌గా బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. పోలీస్‌ శాఖలోని కీలక విభాగంలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ తన సొంత నియోజక వర్గం నుంచి స్వతంత్రంగా పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే పరిశోధన విభాగంలో పనిచేస్తున్న మరో డీఎస్పీ స్థాయి అధికారి కూడా వరంగల్‌ నుంచి పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది.

గెలవకపోయినా పరవాలేదు.. 
అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పోటీచేస్తే గెలుస్తామా లేదా అన్న దానిపై పెద్దగా ఇబ్బంది లేదని, ఇప్పుడు వచ్చే ఓట్లను బట్టి ఐదేళ్ల తర్వాత రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా పనిచేసుకుంటామని ఇద్దరు అధికారులు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈసారి ఎన్నికల్లో సమీప ప్రత్యర్థిగా ఉన్నా తమకు నియోజకవర్గంలో పట్టు పెరుగుతుందని, ఇప్పుడు వస్తున్న ఎన్నికలను ట్రయల్స్‌గా భావించి రంగంలోకి దిగుతున్నామన్నారు. ఐదేళ్లపాటు ప్రజల్లో ఉండి అప్పటి ఎన్ని కల్లో కీలక పార్టీల ద్వారా టికెట్‌ తెచ్చుకుంటే గెలుపు తేలికవు తుందని భావిస్తున్నట్టు ఆ అధికారులు అభిప్రాయపడ్డారు.   

మరిన్ని వార్తలు