ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు రాజకీయ గ్రహణం 

21 Oct, 2019 08:21 IST|Sakshi
రామగుండం ఫెర్టిలైజర్స్‌ కెమికల్‌ లిమిటెడ్‌

సాక్షి, రామగుండం: తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్‌ కెమికల్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ప్లాంట్‌ నిర్మిస్తున్నారు. ప్లాట్‌ నిర్మాణం 99.5శాతం పూర్తి కాగా, త్వరలో ప్రారంభం కానుంది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మరో ఆరునెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుండడంతో రాజకీయ గ్రహణం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ప్లాంట్‌లో పట్టుకోసం పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల జేఏసీలు ప్రయత్నిస్తున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లు..  కొందరు దళారులు తెరపైకి వచ్చి స్థానికులకు కాంట్రాక్టు ఉద్యోగాలిప్పిస్తామంటూ.. సొమ్ములు దండుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. 

1970 అక్టోబర్‌ 2న ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) కంపెనీని స్థాపించారు. ఆ సమయంలో వీర్లపల్లి, లక్ష్మీపురం, అడ్డగుంటపల్లి, ఎల్కలపల్లి గ్రామాలకు సంబంధించిన 1284 ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్నారు. 1980 నవంబర్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభించారు. దాదాపు 19 సంవత్సరాలపాటు సాగిన ఉత్పత్తిని నష్టాలు రావడంతో 1999 మార్చి 31న కంపెనీని మూసివేశారు. ఇందులో 1,069 పర్మినెంట్‌ ఉద్యోగులకు వీఎస్‌ఎస్‌ ద్వారా తొలగించారు. అలాగే రెండువేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను అర్దాంతరంగా రోడ్డున పడేశారు.

తిరిగి ఆర్‌ఎఫ్‌సీఎల్‌గా పునరుద్ధరణ
నష్టాల్లో ఉన్న ఎఫ్‌సీఐని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సుమారు రూ.5,254 కోట్లతో 2015 సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. పునరుద్ధరణ వ్యయం రూ.5,254 కోట్ల నుంచి రూ.6120 కోట్లకు పెరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 63శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 11శాతం, 26శాతం ప్రైవేట్‌ సంస్థలకు వాటాగా నిర్ణయించారు. కంపెనీలో ప్రతిరోజు 2,200 టన్నుల ఆమ్మోనియా, 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

నిర్వాసితులకు న్యాయం జరిగేనా...?
ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రారంభ సమయంలో 2015 మార్చి 11న ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల, ప్రభావిత గ్రామల ప్రజలకు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎఫ్‌సీఐ నిర్మాణానికి లక్ష్మీపురం, ఎల్కలపల్లి, జనగామ, వీర్లపల్లి గ్రామాల ప్రజలు ఎరువుల కర్మాగారం నిర్మాణానికి 1,284 ఎకరాల భూమిని ఇచ్చారు. అప్పట్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న యాజమాన్యం ఇంత వరకు వారికి ఉద్యోగావకాశాలు చూపించలేదు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు, ప్లాంట్‌లో పనిచేసి వీఎస్‌ఎస్‌ ద్వారా ఉద్యోగ విరమణ చేసిన వారికి, కాంట్రాక్ట్‌ కార్మికులకు, ప్రభావిత గ్రామాల యువతకు ఉద్యోగాలు ఏ విధంగా లభిస్తాయో వేచి చూడాలి.

రాజకీయ గ్రహణం..
‘స్థానికులకు కాంట్రాక్టు ఉద్యోగం’ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తూ.. పలు రాజకీయ పార్టీలు ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఇప్పటినుంచే పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. రోజుకో కార్మికసంఘం పేరిట ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. దీనికి తోడు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునః ప్రారంభం అవుతుండడంతో పుట్టగొడుగుల్లా దళారులు పుట్టుకొస్తున్నారు.ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇప్పటికే కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఉద్యోగంపై ఉన్న ఆశతో యువకులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నట్లు సమాచారం.ఇప్పటికైనా యాజమాన్యం దళారీ వ్యవస్థను అరికట్టాల్సి అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు