వారెవా.. గదే పేసు.. జర షర్టే మార్చిండు బాసు..

15 Nov, 2018 10:20 IST|Sakshi

గీయన్ని ఎక్కడో చూసిన...గానీ యాదికి రావట్లె...’ గల్లీల ఎదురైన ఓ సారుని జూసి అనుకున్న. సాయంత్రానికి గాని లెక్కదేల్లె. ఆ సారు గల్లీ ముందరున్న ఇంట్లోనె ఉంటడు. నిన్న మొన్న దాకా తెల్ల జుత్తు పెంచుకుని...లూజు లూజు అంగీలేస్కొని తిరిగేటోడు. ఏమైనదో తెల్వద్‌ గానీ అంతా మార్చేసిండు. జుత్తుకి నల్లరంగేసిండు... మీసాల్‌ గడ్డం తీసేసి ముకం నున్నగ చేసుకునిండు..టీషర్టు ఏస్కొనిండు. గిట్ల టిప్‌టాప్‌గ మేకప్పేస్తే ఎట్లబై గుర్తుపట్టేది? సరే టీషర్టు సారు కత వదలుండ్రి. ఎవరైనా సరే మారడం మంచి గాదె! వయసుపైన పడుతుంటే...మన మొకం గట్లనే మారుతుంటది.

మార్చుడు రెండ్రకాలు. ఒకటి పైకి కనిపించుకునె తీరు! నిన్నటి దాకా సైకిల్‌పై తిరిగేటోడు... ఇయ్యాల బైకుల్లో రయ్‌మంటు తిరుగుతండు. గట్లనే బైకులల్ల పోయేటోడు పేద్దకారు తోలుతు కనిపిస్తండు. మాసిపోయిన బట్టలేస్కొని గాలిపట్టినోడ్లెక్క తిరిగే మనిసి టక్కున కడక్‌ల కనిపిస్తండు. ఏందన్న ఆమ్‌దాన్‌ గానీ పెరిగిందా...గీ మద్యన బలే ఉషారుగున్నవ్‌ అంటూ ముచ్చట్లు పెడ్తుంటం. దూస్ర మార్పు...గది మన లోపల్నుంచి వస్తది. దునియాల సంతోసం..దుక్కం...ఎదురయ్యే సవాల్లు...గివన్నీ మనిసిని తేటచేస్తయి...లేద కుదేల్‌ చేసి గుంతల తోస్తయ్‌. తేటగుంటే నవ్వుతం... కుదేలైతే కండ్లల్ల  నీల్లెట్టుకుంటం...గంతె!  

ఈ మార్పులు ఎవ్రుకైనా ఉండేవె గాని...రాజకీయాల్లో మార్పులు బలె గమ్మత్తుగుంటయ్‌. అంగీలు మార్చినంత సులువుగ పార్టీలు మారుస్తుంటరు. ఎలచ్చన్ల కాలంలొ గిదింకా ఎక్కువ. ఎవ్రు యాడుంటుండ్రో  ఎవ్రుకీ తెల్వదు. అరె మారాలె అనుకున్న ఆసామీకే తెల్వదేమో! ఏంది సారూ నిన్నటి దాంక గా పార్టీలోనె ఉంటివి గదే... ఇయ్యాల గీ పార్టీ అంటావేంది? అన్నావనుకో... నాకోసం గాదె... అంతా జనాల కోసం! ఆల్లకి ఏది మంచిగుంటదనిపిస్తె గది చేసుడే నా పని! అని న్యాక్‌గ లెక్క తేలుస్తడు. అయితే గది జనాల కోసమా... కాదా అన్నది రోడ్లల్ల తిరిగే సాదాసీదా మనిసిక్కూడ తెల్సిపోతది. ఇయన్ని సాలవన్నట్లు ‘మా కార్యకర్తల మనోబావాల లెక్కన నే నిర్ణయం తీస్కుంట...’ అంటూ శానీ లెక్క డైలాగ్‌ కొడ్తరు. ఈ మనోబావమేదో ఆ దేవుడికే తెల్వాలె!  

ఈసారి ఎలచ్చన్ల ఇలాంటి కతలు మస్తుగ వినిస్తున్నయ్‌! నిన్నటి దాకా ఓ పార్టీ జెండా పట్కున్నోడు ...ఈసారి ఇంకో పార్టీల తిరుగుతుండు. ఆటోల్లు ఇటు... ఇటోల్లు మారిపోతుండ్రు.  మొన్ననే మనమందరం చూసిన విచిత్రం...పొద్దున్నే  కాంగ్రెస్‌ల నేనుండ...ఎల్లిపోతున్న అంటూ బీజేపీ గడప తొక్కిన పద్మక్క సాయంత్రానికల్లా అంతా తూచ్‌... గదేం లేదె నేనీడే కాంగ్రెస్‌ల ఉంటా అనిందంటే... ఈ రాజకీయ సర్కస్‌ల జైంట్‌ చక్రం గెట్ల తిరుగుతుందో తెల్సుకుండ్రి మరి!  గీసారి ఎలచ్చన్ల కాంగ్రెస్‌... టీఆరెస్సు పార్టీల్ల  కొందరీ లెక్కనే పొటీలు చేస్తుండ్రంట! గమ్మత్‌ ఏందంటే మల్లీ బరిలోకి దిగి సవాల్లు చేస్కుంటున్నోల్లు వాల్లే!  మొన్న తిట్టినోల్లనే ఈసారి పొగడాలంటె కస్టం గాదె! మనం గట్లనుకుంటం గానీ... పొలిటికల్ల తిరిగేటోల్లకి గిదంతా మామూలె! సీట్లోకి కూర్సునుడే ఆల్లకి గావల్సింది. అంగీల్లెక్క పార్టీల్లో మీరెంతగ అదల్‌ బదల్‌ అయినా మొకం గదేగాదె! జనాలకు గా మొకం గుర్తుంటద? షర్టు గుర్తుంటద? జరంత ఆలోచించండ్రి మీకె తెలుస్తది!!     – రామదుర్గం మధుసూదనరావు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు