రాజ్యసభ పోటీలో జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు

18 Mar, 2018 06:52 IST|Sakshi
రాజ్యసభ పోటీలో  బలరాంనాయక్‌, బండా ప్రకాష్‌

అధికార టీఆర్‌ఎస్‌ నుంచి బండా ప్రకాష్‌

ప్రతిపక్ష కాంగ్రెస్‌ తరఫున బలరాంనాయక్‌

ఈ నెల 23న పోలింగ్‌

గెలుపు ధీమాలో ‘గులాబీ’ అభ్యర్థి

ఇరుకున పెట్టే వ్యూహంలో ‘హస్తం’

పార్టీ ఫిరాయింపుల మైలేజీకి ‘బల’ ప్రయోగం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : పెద్దల సభకు జరగనున్న పోరులో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు బరిలో ఉన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల తరఫున ఇద్దరు నేతలు పోటీ చేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బండా ప్రకాష్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ పోటీలో నిలిచారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండా ప్రకాష్‌ తన గెలుపుపై ధీమాతో ఉన్నారు.  ఎమ్మెల్యే ఓటింగ్‌ను బట్టి సాంకేతిక అంశాలు లేవనెత్తి అధికార పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టే వ్యూహంలో కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది.

శాసనసభ్యుల కోటాలో తెలంగాణ నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల ఐదో తేదీన నోటిఫికేషన్‌ జారీ కాగా.. 23న పోలింగ్‌ జరగనుంది.  ప్రస్తుతం శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు స్థానాలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ గెలుచుకునే అవకాశం ఉంది.  దీంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయని అంతా భావించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్‌ పార్టీ పోటీకి రావడంతో ఎన్నిక అనివార్యంగా మారింది. 

టీఆర్‌ఎస్‌ నుంచి బండా ప్రకాష్‌
వరంగల్‌ జిల్లా నుంచి రాజ్యసభ ఆశావహులు ఎక్కువ మంది ఉన్నా.. అనూహ్యంగా విద్యాధికుడు, సామాజికవేత్తగా గుర్తింపు పొంది రాజకీయాల్లో రాణిస్తున్న డాక్టర్‌ బండా ప్రకాష్‌ పేరును రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆయన చిన్నప్పటి నుంచే చదువుతోపాటు రాజకీయాల్లో ఆసక్తి చూపారు. 1981 నుంచి 1986 వరకు వరంగల్‌ మునిసిపాలిటీ కౌన్సిలర్, వైస్‌ చైర్మన్, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ మెంబర్‌గా వివిధ పదవుల్లో కొనసాగారు. ఆ తర్వాత రాజకీయంగా చెప్పుకోతగ్గ పదవులు చేపట్టలేదు.  

సామాజిక కార్యక్రమాల్లో క్రీయాశీలంగా వ్యవహరించారు.  ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అ«ధ్యక్షుడి ఉన్నారు. తాజాగా రాజ్యసభకు వెళ్లేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ప్రస్తుతం శాసన సభలో టీఆర్‌ఎస్‌కు ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా ఈ గెలుపు లాంఛనప్రాయం. 

‘బల’ ప్రయోగం
రాజ్యసభ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ తొలుత అంటీముట్టనట్లుగా వ్యవహరించింది. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఆ పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. అధికార పార్టీ అభ్యర్థులను ఇరుకున పెట్టేందుకు రాజ్యసభ  బరిలో ఉండాలనే నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్నికల బరిలో జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ చేత నామినేషన్‌ దాఖలు చేయించింది.

ఆ తర్వాత అసెంబ్లీలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిప్పు, ఉప్పు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ పేర్కొంటున్న ఎమ్మెల్యే సంఖ్యలో ఉన్న ‘ఫిరాయింపుల’ను చర్చకు తెచ్చి మైలేజ్‌ పొందే వ్యూహంలో కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. 
 


 

మరిన్ని వార్తలు