రాజకీయాలను తేలిగ్గా తీసుకోవద్దు 

25 Mar, 2019 16:43 IST|Sakshi
మాట్లాడుతున్న ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు

సత్తుపల్లి: రాజకీయాలను తేలిగ్గా తీసుకోవద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్థానిక లక్ష్మీప్రసన్న ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం రాత్రి నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాజకీయాలు మీ కళ్ల ముందే రంగులు మారుతున్నాయి.. మీ అందరి కష్టం వల్లే పదవులు వస్తున్నాయి..’అని పేర్కొన్నారు.

ఖమ్మం ఎంపీ సీటు గెలవటం సీఎం కేసీఆర్‌కు అవసరం.. టీఆర్‌ఎస్‌ అవసరం.. తెలంగాణ రాష్ట్రానికి అవసరమని అన్నారు.రాజకీయ ప్రాధాన్యం దక్కుతుండడంతో ప్రత్యర్థులు తన మీద అసూయతోనే అందరు కలిసి ఓడించారని అన్నారు. టీఆర్‌ఎస్‌లో తాను చేరిన తర్వాత ఐదారువేల ఓట్లు ఉన్న నియోజకవర్గాల నుంచి 80 వేలకుపైగా ఓట్లు ఉన్న నియోజకవర్గాలుగా మారాయని, కేవలం వెయ్యి, రెండువేల ఓట్ల తేడాతో ఐదారు సీట్లు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తానెక్కడ ఉన్నా సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఆపలేదని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలనేదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.

 శ్రీనివాసరెడ్డికి అప్పీల్‌ చేస్తున్నా: ఎంపీ అభ్యర్థి నామా 
రాజకీయాలు పక్కనబెట్టి మద్దతు ఇవ్వాలని, కలిసిమెలిసి పనిచేద్దామని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పీల్‌ చేస్తున్నట్లు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్లే తనకు ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష చేసినప్పుడు పార్లమెంట్‌లో అందరు సభ్యులను కదిలించేలా పని చేశానని, చిదంబరం ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను ఒక కారణమయ్యానని తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీలో సాంకేతికంగా చేరకపోయినా, సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు అందరి అభిప్రాయాలు తీసుకొని టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరతామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.

బూత్‌ లెవల్‌లో అందరిని కలుపుకొని పని చేసి సత్తుపల్లిలో నామాకు మంచి మెజార్టీ వచ్చేలా పని చేద్దామన్నారు. పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నట్లు పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారని, అలాంటి సంఘటన జరిగినట్లు నిరూపిస్తే తాను గుండు కొట్టించుకుంటామని, ఈ సవాల్‌ను పవన్‌ కల్యాణ్‌ కూడా స్వీకరించాలని అన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయబాబు, డాక్టర్‌ మట్టా దయానంద్, చల్లగుళ్ల నర్సింహారావు, చల్లగుండ్ల కృష్ణయ్య, దొడ్డా శంకర్‌రావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, కూసంపూడి నర్సింహారావు, దాసరి శ్రీధర్‌రెడ్డి, మోరంపూడి ప్రభాకర్, మోరంపూడి ప్రసాద్, ఒగ్గు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు