ఫ్లెక్సీలతో డేంజర్‌!

13 Feb, 2019 10:24 IST|Sakshi

పర్యావరణానికి హాని కలిగిస్తున్న వైనం

గ్రేటర్‌లో నిత్యం సుమారు 300 టన్నుల ఫ్లెక్సీ (పీవీసీ)వ్యర్థాలు

బహిరంగ ప్రదేశాల్లో తగలబెడుతుండడంతో అనర్థాలు

కాలుష్యాన్ని పెంచుతున్న కెమికల్స్‌

సాక్షి, సిటీబ్యూరో: అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఫ్లెక్సీల వెనక పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి ఏర్పడుతున్న ముప్పు ఆందోళన కలిగిస్తోంది. మహానగరం పరిధిలో వేలాదిగా ఉన్న హోర్డింగ్‌లతోపాటు, వివాహాది శుభకార్యాలకు సైతం పాలీ వినైల్‌ క్లోరైడ్‌(పీవీసీ)తో తయారుచేసిన బ్యానర్లు ఉపయోగించడం ఆనవాయితీగా మారింది. అయితే వీటిని తరచూ మార్చేసమయంలో పీవీసీ ఫ్లెక్సీల వ్యర్థాలను సాధారణ చెత్తతోపాటు పడవేసి ఆరుబయట తగులబెడుతుండడంతోనే అనర్థాలు తలెత్తుతున్నాయి. వీటి నుంచి వెలువడే పొగలో కేన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెన్స్, డయాక్సీన్స్, వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ గాలిలో చేరి పీల్చే గాలిని కలుషితం చేస్తుండడం అనర్థాలు తెచ్చిపెడుతోంది. మహానగరం పరిధిలో నిత్యం సుమారు 4800 టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పన్నమౌతుండగా..ఇందులోసుమారు 300 టన్నుల వరకు ఇలాంటి వ్యర్థాలున్నట్లు  పీసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

అమ్మో పీవీసీ ఫ్లెక్సీలు..
గ్రేటర్‌ పరిధిలో పలు బహుళజాతి, వాణిజ్య సంస్థలు, దేశీయ కంపెనీలు, వినియోగ, విలాస వస్తువులకు చెందిన వాణిజ్య ప్రకటనలు అందరికీ కనిపించేలా ప్రదర్శించేందుకు వేలాదిగా హోర్డింగ్‌లున్నాయి. వీటన్నింటికీ జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా..వీటిపై వాణిజ్య ప్రకటనల నిమిత్తం అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా అధిక గాఢత కలిగిన రంగులు, పాలీవినైల్‌ క్లోరైడ్స్‌(పీవీసీ)తో చేసిన ఫ్లెక్సీలను వినియోగిస్తున్నారు. వీటి ఆకర్షణ తగ్గకుండా వీటిని ప్రతీనెలా మార్చేస్తున్నారు. ఈ వ్యర్థాలను సాధారణ చెత్తతోపాటే పడవేస్తుండడంతోపాటు డంపింగ్‌యార్డులు, బహిరంగ ప్రదేశాల్లో వేసి తగులబెడుతున్నారు. వీటి నుంచి  వెలువడుతోన్న విషవాయువులు పర్యావరణంలో కలుస్తున్నాయి. ఈ వాయువులను పీల్చినవారి కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినడంతోపాటు నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధుల బారినపడుతున్నారు. ఈ పరిణామం దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో కేన్సర్‌కు కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

బెంగళూరు ఆదర్శం..   
పీవీసీ ఫ్లెక్సీల స్థానంలో కాగితం, బట్ట(క్లాత్‌)తో తయారుచేసిన ఫ్లెక్సీలను వినియోగిస్తూ బెంగళూరు మహానగరం దేశంలోని పలు సిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది. గ్రేటర్‌ పరిధిలోనూ ఇదే స్ఫూర్తితో ఇలాంటి విధానాన్ని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో నగర పర్యావరణానికి మేలుజరగడంతోపాటు..సిటీజన్లు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడినవారవుతారని స్పష్టంచేస్తున్నారు.

నిత్యజీవితంలో ఉపయోగించేపలు వస్తువులు విచ్ఛిన్నం అయితేలికగా పర్యావరణంలో కలిసేందుకు పట్టే సమయం ఇలా...

వస్తువు                          పట్టే సమయం
ప్లాస్టిక్‌ కవర్లు, బ్యాగులు,    200–1000 ఏళ్లు
పీవీసీఫ్లెక్సీలు పేపర్‌ బ్యాగ్‌  ఒకనెల
కాటన్‌సంచి                    3 నెలలు
ఫ్లైఉడ్‌                           13 ఏళ్లు
పాలకార్టన్స్‌                     5 ఏళ్లు
కార్డ్‌బోర్డ్‌                        2 నెలలు
వార్తాపత్రికలు                 1.5 నెలలు
సిగరెట్‌ పెట్టె                   10–12 ఏళ్లు
లెదర్‌షూజ్‌                   25–40 ఏళ్లు
పలుచటి స్టీల్‌క్యాన్‌          50 ఏళ్లు
రబ్బర్‌బూట్‌ సోల్‌            50–80 ఏళ్లు
అల్యూమినియం క్యాన్‌     200–500 ఏళ్లు

మరిన్ని వార్తలు