హమ్మయ్య

25 Apr, 2020 08:15 IST|Sakshi
నిర్మానుష్యంగా ఉన్న హైటెక్‌ సిటీ ప్రాంతం

కాలుష్యం తగ్గడమూ కలిసొస్తోంది!

లాక్‌డౌన్‌తో గ్రేటర్‌లో తగ్గిన పలు కాలుష్యాలు

అన్ని ప్రాంతాలూ గ్రీన్‌జోన్‌లోనే...

కోవిడ్‌ రోగులపై అత్యధిక ప్రభావం చూపే సూక్ష్మ ధూళి కణాలు సైతం తగ్గుముఖం

వాయు కాలుష్యం పెరగకుండా చూసుకోవాలని సూచిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ మహానగరం ఇప్పుడు కనివినీ ఎరుగని రీతిలో అత్యుత్తమ వాయు నాణ్యత సూచీతో పలు మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వాయు, శబ్ద, పారిశ్రామిక కాలుష్యాలు గణనీయంగా తగ్గుముఖం పట్టడం కూడా కోవిడ్‌ వ్యాప్తిని నిరోధిస్తోంది. పీల్చే గాలిలో సూక్ష్మ, స్థూల ధూళి కణాల మోతాదు తగ్గడం కూడా కోవిడ్‌ రోగులు త్వరగా కోలుకునేందుకు కారణమౌతోంది. శ్వాసకోశ సమస్యలున్న వారికి సైతం ఈ పరిణామం ఊరటనిస్తోంది. కాలుష్యం పరంగా చూస్తే నగరంలో దాదాపు అన్ని ప్రాంతాలు ప్రస్తుతం గ్రీన్‌జోన్‌ పరిధిలో ఉన్నట్టే లెక్క. లాక్‌డౌన్‌ కారణంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో కాలుష్యం తగ్గినప్పటికీ.. సమీప భవిష్యత్‌లోనూ పెరగకుండా చూసుకోవాల్సి ఉంది. వాయునాణ్యత సరిగా లేని నగరాలకు కోవిడ్‌ ముప్పు పొంచి ఉంటుందని.. రోగులకు సైతం ఈ పరిణామం శాపంగా పరిణమిస్తోందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. పలు లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తగిన మూల్యం చెల్లించుకున్నాయని తాజా సైంటిఫిక్‌ జర్నల్‌లో హెచ్చరికలు జారీచేయడం గమనార్హం.

గ్రేటర్‌లో కాలుష్యం తగ్గిందిలా...
మహానగరం పరిధిలోని సుమారు 50 లక్షల వాహనాలున్నాయి. ఇందులో 15 ఏళ్లకు పైబడినవి సుమారు 15 లక్షల వరకున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఇళ్లకే పరిమితం కావడంతో వాయుకాలుష్యం గణనీయంగా తగ్గింది. పలు పరిశ్రమలు మూతపడటం, నిర్మాణ రంగ కార్యకలాపాలు నిలిచిపోవడమూ కాలుష్యం తగ్గడానికి కారణాలే. పీసీబీ లెక్కల ప్రకారం పీల్చే గాలిలో ధూళికణాల మోతాదు 40 మైక్రోగ్రాములు మించరాదు. కానీ లాక్‌డౌన్‌కు ముందు సాధారణ రోజుల్లో ప్రతి ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ,స్థూల ధూళికణాల మోతాదు 80 నుంచి 90 మైక్రో గ్రాములుగా ఉండేది. ఇప్పుడు అందులో సగం అంటే 30–45 మైక్రోగ్రాములు మాత్రమే నమోదవుతోంది. ఊపిరి తిత్తులకు పొగబెట్టే ధూళికణాలతోపాటు మోటారు వాహనాల నుంచి వెలువడే కార్భన్‌ మోనాౖMð్సడ్, డయాౖMð్సడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, బెంజీన్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ తదితర కాలుష్య కారకాల మోతాదు కూడా తగ్గిపోవడంతో గ్రేటర్‌ సిటీజన్లకు స్వచ్ఛ గాలి సాకారమౌతోంది. ఇటీవల కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన నివేదికలో 51 లోపు పాయింట్లు సాధించిన గ్రేటర్‌ సిటీ అత్యంత మెరుగైన వాయునాణ్యత సూచీ కలిగిన సిటీగా నిలవడం విశేషం. ఏడాదికి సుమారు 183 రోజులు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరయ్యే అబిడ్స్, పంజగుట్ట, ప్యారడైజ్, జూపార్క్, చార్మినార్, కూకట్‌పల్లి, బాలానగర్, గచ్చిబౌలి, ఉప్పల్‌ ప్రాంతాల్లోనూ ఇప్పుడు ఘనపు మీటరు గాలిలో ధూళికణాల మోతాదు 40 మైక్రోగ్రాములు దాటకపోవడం విశేషం. 

ఇదే స్ఫూర్తి కొనసాగాలి...
లాక్‌డౌన్‌ అనంతరం కూడా నగరంలో ధూళి కాలుష్యం కట్టడికి ఇటు ప్రభుత్వం, అటు పౌర సమాజం ముందుకు రావాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ప్రజా రవాణాను వినియోగించడం, అనవసరంగా వాహనాల్లో రోడ్లపైకి రాకపోవడం, నంబర్‌ సిరీస్‌ విధానాలను అమలు చేయడం, కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడటం, ఇంధన కల్తీ లేకుండా కట్టడి చేయడం, మహోద్యమంగా హరిత హారం చేపట్టడం వంటి చర్యలతో వాయు కాలుష్యాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు