రేపటి నుంచి పాలీసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

24 Jun, 2015 03:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ర్యాంకుల వారీగా నిర్ణీత తేదీల్లో విద్యార్థులు వెరిఫికేషన్‌కు హాజరు కావాలని తెలిపారు. ఆయా తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండు దఫాలుగా ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తారని వెల్లడించారు. ఇక విద్యార్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 2వ తేదీన ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని వివరించారు. 5వ తేదీన సీట్లను కేటాయించి, తమ వెబ్‌సైట్ (https://tspolycet.nic.in)లో అందుబాటులో ఉంచ నున్నట్లు తెలిపారు.

 

హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు. వికలాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కేటగిరీలకు చెందిన వారికి ఈ నెల 25, 26 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మాసాబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా దాదాపు 60 వేల సీట్లను భర్తీ చేయనున్నారు.

మరిన్ని వార్తలు