నేడే పాలీసెట్‌

16 Apr, 2019 08:06 IST|Sakshi

పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

నిమిషం ఆలస్యమైనా అనుమతించం    

కో–ఆర్డినేటర్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌

రాయదుర్గం: పాలీసెట్‌–2019 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లెదర్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ ప్రిన్సిపల్, సెట్‌ గచ్చిబౌలి కో–ఆర్డినేటర్‌ ఎస్‌.ఇక్బాల్‌ హుస్సేన్‌ తెలిపారు. రాయదుర్గంలోని జీఐఎల్‌టీ ఇనిస్టిట్యూట్‌లో సోమవారం ఆయన ఏర్పాట్లను వివరించారు. స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో పాలీసెట్‌–2019 పరీక్ష నిర్వహణ జరుగుతోందన్నారు. మంగళవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను గంట ముందే అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్ష సమయానికి (11గంటలు) ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు.

గచ్చిబౌలి పరిసరాల్లో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గచ్చిబౌలి డివిజన్‌ మధురానగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మణికొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నార్సింగిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కేంద్రాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి హాల్‌టికెట్, హెచ్‌బి/2బి పెన్సిల్, బ్లూ/బ్లాక్‌ బాల్‌పెన్స్‌ తప్పా మరే ఇతర వస్తువులు తీసుకురావద్దని సూచించారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి సులువుగా చేరుకోవడానికి, గుర్తించడానికి ప్రత్యేక యాప్‌ ‘పాలీసెట్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌ లొకేటర్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.  

>
మరిన్ని వార్తలు