చెరువులకు మహర్దశ

27 Feb, 2019 09:24 IST|Sakshi

ఆక్రమణలు, కలుషిత జలాలకు అడ్డుకట్ట  

సీసీటీవీలతో నిఘా   ఎల్బీనగర్, గచ్చిబౌలిల్లో ప్రత్యేక శిబిరాలు  

సాక్షి, సిటీబ్యూరో: కలుషిత జలాలు, ఆక్రమణలతో చిన్నబోతున్న గ్రేటర్‌ చెరువులను పరిరక్షించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మహానగరం పరిధిలోని సుమారు 185 చెరువులను ఆక్రమణలు, కలుషిత జలాల బారి నుంచి రక్షించేందుకు బల్దియాలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం) విభాగం ఆధ్వర్యంలో ఆయా జలాశయాల వద్ద సీసీ టీవీలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ కెమెరాలను నిరంతరం ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో పర్యవేక్షించేందుకు ఎల్బీనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఆయా చెరువుల్లోకి నిర్మాణ వ్యర్థాలను వదులుతున్న అక్రమార్కులు, కబ్జాలకు పాల్పడే వారిని అడ్డుకునేందుకు వీలుంటుంది. చెరువుల్లోకి నిర్మాణ వ్యర్థాలు వదిలిపెట్టే వారిపై నిరంతర నిఘా పెట్టడంతో పాటు వారి ఆగడాలకు చెక్‌ పెట్టే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.  

నిలువెల్లా కాలుష్యం...  
నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ కాలుష్యకాసారంగా మారుతున్నాయి. పలు చెరువుల్లో ఇటీవల కాలంలో గుర్రపుడెక్క విస్తృతంగా విస్తరించింది. మరోవైపు సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలను మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి వదులుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గందభరితంగా మార్చేస్తున్నాయి. ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థజలాల్లో ఉండే ఫేకల్‌కోలిఫాం, టోటల్‌ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతో పాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా పరిశీలనలో తేలింది. ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్‌ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం.

మురుగుతో అవస్థలు...
సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరడంతోనే ఈ దుస్థితి తలెత్తింది.  
గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం, చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో చెరువులు మురుగు కూపాలవుతున్నాయి.
పలు చెరువులు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో సగం భూములను కోల్పోయి చిక్కి శల్యమైకనిపిస్తున్నాయి.
రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్‌ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధి లేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది.

ప్రక్షాళన చర్యలివీ...  
చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సి న చర్యలపై ‘సేవ్‌ అవర్‌ అర్బన్‌ లేక్స్‌’ సంస్థ నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలివీ...
గ్రేటర్‌ పరిధిలోని 185 చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. ఆయా చెరువుల్లో అట్టడుగున పేరుకుపోయిన ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి.
జలాశయాల ఉపరితలంపై ఉధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి.
చెరువుల్లో ఆక్సిజన్‌ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.
గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి.
ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి.
చెరువులు అన్యాక్రాంతం కాకుండా ఎఫ్‌టీఎల్‌ బౌండరీలు, రక్షణ కంచె ఏర్పాటు చేయాలి. నిరంతరం నిఘా పెట్టాలి.
జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తునహరితహారం చేపట్టాలి.
వర్షపు నీరు చేరే ఇన్‌ఫ్లో చానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి.
జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలి.
కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.

మరిన్ని వార్తలు