చినుకు పడక .. చెరువులు నిండక..

14 Aug, 2014 23:57 IST|Sakshi

కీసర: వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా చిరుజల్లులు తప్ప భారీవర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు వట్టిపోతున్నాయి. అడపాదడపా చిరుజల్లులు కురుస్తున్నా మండుతున్న ఎండలకు అవి కాస్తా ఆవిరైపోతున్నాయి. మండలంలో మొత్తం 12 నోటిఫైడ్ చెరువులు, మరో 30 వరకు చిన్నాచితక కుంటలు ఉన్నాయి. రాంపల్లి పాతచెరువు, నాగారం అన్నరాయిని చెరువులు మినహా మిగతా చెరువుల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లో కూడా అడుగు నీరు లేకుండా పోయాయి.

 ఇక కుంటల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కొన్ని చోట్ల నీటి సంగతి దేవుడెరుగు కుంటల స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. చెరువుల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోవడంతో ఆయా గ్రామాల్లో  భూగర్భజలాలు  రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. బోరుబావుల్లో నీటిమట్టాలు పడిపోవడంతో ఇటు పంటల సాగుకు, అటు ప్రజలకు తాగునీటికి కష్టాలు మొద లయ్యాయి. చెరువు కింద వ్యవసాయం చేసే రైతులు, బోరు బావులపై ఆధారపడి పంటలుసాగు చేద్దామని వరినార్లు పోసిపెట్టుకున్న రైతులకు ఈ సీజన్‌లో నష్టాలు తప్పడం లేదు. వరినాట్లు వేసే సమయం ముగిసిపోవడంతో చేసేది లేక నారుమడులను పొలంలోనే వదిలేశారు.

మరోవైపు వచ్చే వేసవిలో తాగునీటి కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల క్రితం నిజాం కాలంలో నిర్మించిన చెరువులకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకలేదు. పూడికతీత, ముళ్లపొదలను తొల గించడం వంటి పనులు చేపట్టకపోవడంతో చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కీసర నూర్‌మహ్మద్ చెరువు ఒక్కసారి నిండితే ఐదేళ్లపాటు కాలం లేకున్నా నీరు ఉండేది. చెరువు కట్టకు షేడ (రంధ్రం) పోవడంతో వర్షకాలంలో చెరువులోకి వచ్చి చేరే వరద నీరు వచ్చినట్లే బయటకు పోతోంది.

ఇక గోదుమకుంట తీగల నారాయణ చెరువు, చీర్యాల పెద్ద చెరువు, చీర్యాల నాట్కాన్ చెరువు, రాంపల్లి సూర్యనారాయణ చెరువు, యాద్గారపల్లి గండి చెరువు, రాంపల్లిదాయర జాఫర్‌ఖాన్ చెరువు, కీసర పెద్దమ్మ, తిమ్మాయిపల్లి పెద్ద చెరువు, దమ్మాయిగూడ నర్సింహ చెరువులకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరు నిల్వ ఉండడం లేదు. ఇప్పటికైనా మరమ్మతులు చేపడితే భవిష్యత్తులో వర్షాలు కురిస్తే చెరువుల్లో నీరు నిల్వ ఉం టుందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు