'ఖమ్మం జిల్లాలో గిరిజన వర్సిటీ నెలకొల్పాలి'

4 Aug, 2015 08:54 IST|Sakshi
'ఖమ్మం జిల్లాలో గిరిజన వర్సిటీ నెలకొల్పాలి'

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అత్యధికంగా గిరిజన జనాభా నివసిస్తున్న ఖమ్మం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన లోక్‌సభలో 377వ నిబంధన కింద ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.

గిరిజన జిల్లాగా పేరుగాంచిన ఖమ్మంలో గిరిజన వర్సిటీ నెలకొల్పాల్సిన ఆవశ్యకతను వివరించారు. ‘వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇందుకు కారణం వారికి ఉన్నత, సాంకేతిక విద్య అందుబాటులో లేకపోవడమే. 2001 గణాంకాల ప్రకారం ఖమ్మం జిల్లాలో గిరిజన జనాభా 7.43 లక్షలు. ఇది జిల్లా జనాభాలో 27.24 శాతం.

జిల్లాలో మొత్తం 41 మండలాలుంటే అందులో 24 గిరిజన మండలాలే. అత్యధికులు ఆర్థిక స్థితి సరిగా లేక ఉన్నత చదువులు అందుకోలేకపోతున్నారు. అందువల్ల ఖమ్మం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతున్నా..’ అని పొంగులేటి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు