కామారెడ్డిలో ప్రారంభమైన పొంగులేటి రైతుదీక్ష

10 May, 2015 12:18 IST|Sakshi
కామారెడ్డిలో ప్రారంభమైన పొంగులేటి రైతుదీక్ష

నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. అందులోభాగంగా ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వరంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో  రైతు దీక్ష ప్రారంభమైంది.  ఈ రైతు దీక్ష రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరుకానున్నారు.

హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో 2014 జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 784 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 140 కాగా, కరీంనగర్‌లో 115, ఆదిలాబాద్‌లో 98 మంది ఆత్మహత్య  చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 50 మందికిపైగా రైతులు తనువు చాలించారు. కాడినే నమ్ముకున్న రైతులను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత పట్టించుకునేవారు లేకుండా పోవడంతో రైతు పరిస్థితి దయనీయంగా మారింది.  రైతులు, రైతు సంఘాల గణాంకాల ప్రకారం 784 మంది రైతులు మృతి చెందారు.

అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 96 మంది రైతులు మాత్రమే చనిపోయినట్లు ప్రకటించింది. కనీసం ఆ 96 మంది రైతు కుటుంబాలను సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలు, వారి ఆత్మహత్యలపై పోరాటం కోసం నడుంకట్టింది.

మరిన్ని వార్తలు