కాంగ్రెస్‌కు పొంగులేటి రాజీనామా

1 Apr, 2019 03:22 IST|Sakshi

పార్టీ అధ్యక్షుడు రాహుల్‌కు సుధాకర్‌రెడ్డి లేఖ

రాష్ట్ర నాయకత్వం పార్టీని కమర్షియల్‌గా మార్చిందని ధ్వజం

ప్రధాని మోదీతో భేటీ.. అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరిక

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సీఎల్పీ మాజీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు. రాష్ట్ర నాయకత్వం పార్టీని బలోపేతం చేయడంలో విఫలమైందని, టికెట్ల కేటాయింపును డబ్బుమయం చేసి కాంగ్రెస్‌ను కమర్షియల్‌ పార్టీగా మార్చేసిందంటూ లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీ లోటుపాట్లను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ అదే నాయకత్వానికి లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు ఇచ్చారని విమర్శించారు.

ఈవీఎంల వల్లే టీఆర్‌ఎస్‌ గెలిచిందని కాంగ్రెస్‌ నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. పార్టీపై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఇక దేశ రక్షణ, జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్‌ రాజకీయాలు చేయడం బాధించిందన్నారు. పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్‌ జరిపిన సర్జికల్‌ దాడులకు సంబంధించిన సాక్ష్యాలు చూపాలని అడగడం సిగ్గుచేటన్నారు. ఈ తరుణంలో దేశానికి ఒక బలమైన నాయకత్వం అందించగలిగే పార్టీలో చేరాలని నిర్ణయించుకొని కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. 

ప్రధాని మోదీతో భేటీ..
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించడంతో ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో పొంగులేటి బీజేపీలో చేరారు. ఆయనకు అమిషా షా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ఒక కార్యకర్తగా తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఏన్నో ఏళ్లపాటు కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తవ్వగానే పార్టీని వీడటం అవకాశవాదం కాదా అని ప్రశ్నించగా కాంగ్రెస్‌ కోసం తాను 35 ఏళ్లు కష్టప డ్డానని, కానీ పార్టీ తన కష్టంలో 20 శాతమే గుర్తించి అవమానించిందన్నారు.

మరిన్ని వార్తలు