ఓటమిపై నివేదికలివ్వండి: పొన్నాల

22 May, 2014 03:27 IST|Sakshi
ఓటమిపై నివేదికలివ్వండి: పొన్నాల

సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కారణాలేమిటో తెలియజేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లను ఆదేశించారు. పార్టీ అభ్యర్థుల ఓటమికి గల కారణాలను వివరిస్తూ సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు. అయితే, మరోవైపు ఓటమికి గల కారణాలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ప్రత్యేక నివేదిక అందజేయాలని ఎన్నికల్లో ఓటమిపాలైన తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని నిజాంక్లబ్‌లో జి.వివేక్, పొన్నం ప్రభాకర్, రాజయ్య, అంజన్‌కుమార్, సురేష్ షెట్కార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి నేతృత్వంలో గురువారం సోనియాగాంధీని కలిసి నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ఇటీవలి అకాల వర్షాల వల్ల  దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున బృందాలను పంపించాలని పొన్నాల లక్ష్మయ్య డీసీసీ అధ్యక్షులను ఆదేశించారు. కాగా, నెహ్రూ-గాంధీ కుటుంబాలకు సంబంధించి ఏ చిన్న కార్యక్రమం జరిగినా హడావుడి చేసే కాంగ్రెస్ నేతలు... బుధవారం రాజీవ్‌గాంధీ 23వ వర్ధంతి కార్యక్రమం  సాదాసీదాగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి మినహా నాయకులెవరూ హాజరుకాలేదు. కార్యకర్తలు కూడా పదుల సంఖ్యలో మాత్రమే వచ్చారు.

మరిన్ని వార్తలు