-

ఏడాది లోపే!

3 Mar, 2015 00:34 IST|Sakshi
ఏడాది లోపే!

పీసీసీ చీఫ్ పదవి మార్పు  ‘పొన్నాల’ను తప్పించిన ఏఐసీసీ
తెలంగాణ తొలి అధ్యక్షుడిగా రికార్డు  జిల్లాకు కలిసిరాని పీసీసీ పదవి

 
వరంగల్ :  రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య పదవి పోయింది. పీసీసీ అధ్యక్షుడిని మార్చుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలోనే ఉన్నత పదవిని పొందిన లక్ష్మయ్య అర్ధంతరంగా ఏడాదిలోపే ఈ పదవి నుంచి తప్పుకోవాల్సి  వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత సాధారణ ఎన్నికల ముందు ఆయన పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడిగా 2014 మార్చి 13న బాధ్యతలు తీసుకున్నారు.

ఈయన నేతృత్వంలోనే పార్టీ సాధారణ ఎన్నికలకు వెళ్లి దారుణంగా ఓటమిపాలైంది. జనగామలో స్వయంగా ఆయన ఓడిపోయారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత నుంచి పొన్నాలను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారిక నిర్ణయం ప్రకటించింది. దీంతో ఏడాదిలోపే పొన్నాల పీసీసీ చీఫ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పొన్నాలకు అవకాశం వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

కలిసిరాలేదు..

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి మన జిల్లా నేతలకు కలిసిరాలేదు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి రెండుసార్లు జిల్లా నేతలకు దక్కింది. ఈ రెండు సార్లు సాధారణ ఎన్నికల్లో హస్తం పార్టీ దారుణంగా ఓడింది. తాజా ఎన్నికల్లో పొన్నాల కూడా ఓడిపోయారు. 1999 ఎన్నికల ముందు వరకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా వచ్చేవి.

1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన మహమ్మద్ కమాలుద్దిన్ అహ్మద్ నియమితులయ్యారు. అప్పుడు కమాలుద్దిన్ హన్మకొండ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. జిల్లా నుంచి పలుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన పీవీ నర్సింహారావు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు కేవలం 26 సీట్లే దక్కాయి. కమాలుద్దిన్ అహ్మద్ సొంత జిల్లాలో డోర్నకల్ స్థానంలో డీఎస్ రెడ్యానాయక్ మాత్రమే గెలిచారు. తాజా ఎన్నికల్లోనూ ఇలాగేజరిగింది.

మరిన్ని వార్తలు