చక్రబంధంలో టీపీసీసీ చీఫ్!

27 Nov, 2014 01:37 IST|Sakshi
చక్రబంధంలో టీపీసీసీ చీఫ్!

* భూముల విషయంలో పొన్నాలకు ఇరకాటం
* సర్కారు వ్యూహంతో ఆత్మరక్షణలో కాంగ్రెస్
* ప్రతిపక్షాన్ని ఇరుకునపెట్టిన అధికారపక్షం
* సభాసంఘం ఏర్పాటు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో అధికార పార్టీ వ్యూహంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడిపోయింది. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను లక్ష్యంగా చేసుకుని అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం చేపట్టిన చర్చ ద్వారా కాంగ్రెస్ శాసనసభా పక్షం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. బుధవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవ ర్ ముగిసిన తర్వాత పొన్నాలకు భూ కేటాయింపుల అంశాన్ని నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు.

దీనికి శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ వివరాలను సభ ముందుంచారు. తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడారు. ఒక వ్యక్తిని ఉద్దేశించి అసైన్డు భూముల వ్యవహారాన్ని చ ర్చకు తీసుకోలేదని, అన్ని రకాల భూముల వ్యవహారంపై వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే చర్చంతా పొన్నాల లక్ష్యంగానే సాగింది. దీంతో పీసీసీ చీఫ్‌ను వెనకేసుకువచ్చే పరిస్థితి కాంగ్రెస్ సభ్యులకు లేకపోయింది.

మధ్యలో సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని వాదించే ప్రయత్నం చేశారు. అయితే వారి వాదనలో బలం లేకపోవడం, ప్రభుత్వం వద్ద ఆధారాలు బలంగా ఉండడంతో ఏమీ చేయలేకపోయారు. వరంగల్ జిల్లాలోని రాంపూర్ గ్రామంలో దళితుల భూమిని పొన్నాల ఎలా దక్కించుకున్నారో ఆధారాలతో సహా హరీశ్‌రావు వివరించారు. దీంతో ఎవరూ పొన్నాలకు అనుకూలంగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అసైన్డ్ భూముల విషయంలో ఉన్న నిబంధనలు, పొన్నాల విషయంలో జరిగిన ఉల్లంఘనలు, కోర్టుల మొట్టికాయలు, కాగ్ అక్షింతలు, ఏపీఐఐసీతో అధికార దుర్వినియోగం, అప్పటి కాంగ్రెస్ సర్కారు తీరు వంటి అనేక అంశాలను హరీశ్ ప్రస్తావించడంతో పొన్నాల చక్రబంధంలో చిక్కుకున్నట్లయింది.

‘టీపీసీసీ చీఫ్ పొన్నాల భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను బదనాం చేయాలనుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం విజయవంతమైంది. ఒక విధంగా మేం ఈ రోజు ఆత్మరక్షణలో పడ్డాం. అయితే సభాసంఘం పది జిల్లాల్లో అన్యాక్రాంతమైన భూములకు సంబంధించి విచారణ జరుపుతుంది. అదొక్కటే ఊరట’ అని కాంగ్రె స్‌కు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.

 ‘ఈ వివాదం వల్ల  ప్రభుత్వ తీరును పీసీసీ చీఫ్ ఎలా ఎండగడతారు?’ అని అభిప్రాయపడ్డారు. ‘టీపీసీసీ అధ్యక్షునిగా పార్టీని అధికారంలోకి తీసుకురాలేక పోయినప్పుడే, ఆయన తప్పుకొని ఉంటే గౌరవంగా ఉండేది. ఇప్పుడు ఈ వివాదం వ్యక్తగతమే అయినా, ఆయన టీపీసీసీ అధ్యక్షుడు కావడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది’ అని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

ఇప్పుడు పొన్నాల తప్పొప్పుల గురించి చర్చించి లాభం లేదని, పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓ వర్గం తాజా పరిణామంతో ఆనందంలో మునిగిపోయింది. పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని ప్రచారం సాగుతున్న తరుణంలో ఇప్పుడు అసైన్డ్ భూముల వివాదం తెరపైకి రావడం వ్యూహాత్మకమేనని ఆ వర్గం భావిస్తోంది.

మరిన్ని వార్తలు