కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రభాకర్‌

20 Sep, 2018 08:36 IST|Sakshi
పొన్నం ప్రభాకర్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ పార్లమెంట్‌ మాజీ సభ్యుడు, సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అవకాశం దక్కింది. కొద్ది రోజులుగా ప్రభాకర్‌ పేరు వినిపిస్తున్నప్పటికీ.. ఎట్టకేలకు ఆయన నియామకాన్ని అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లట్‌ బుధవారం ప్రకటించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పీసీసీ కమిటీతోపాటు తొమ్మిది అనుబంధ కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఈ సందర్భంగా కోర్‌ కమిటీ, కో ఆర్డినేషన్‌ కమిటీ, క్యాంపేయిన్‌ కమిటీ, ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ కమిటీ, ఎల్‌డీఎంఆర్‌సీ కమిటీ, ఎలక్షన్‌ కమిషన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ, డిసిప్లినరీ యాక్షన్‌ కమిటీ పేరుతో అనుబంధ కమిటీలలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురికి స్థానం కల్పించారు. కాగా.. మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ తదితరులకు మూడు, నాలుగు కమిటీల్లో స్థానం కల్పించగా, మరికొందరిని విస్మరించారు.
 
కోర్‌కమిటీలో దక్కని చాన్స్‌.. మిగతా కమిటీల్లో పెద్దపీట..ఏఐసీసీ, టీపీపీసీలు కీలకంగా భావించిన తొమ్మిది కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు సీనియర్లకు అవకాశం కల్పించి పెద్దపీట వేశారు. అయితే.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు ఎన్‌ఎస్‌ బోసురాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్‌ తదితర 15 మందితో కూడిన కోర్‌కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. ఇతర జిల్లాలకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కి గౌడ్, ఎ.సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి జాబితాలో మనవాళ్ల పేర్లు లేవు. 53 మందితో కూడిన కో ఆర్డినేషన్‌ కమిటీలో పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు తాటిపర్తి జీవన్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అవకాశం దక్కింది. 17 మందితో కూడిన ప్రచార కమిటీ (క్యాంపెయిన్‌ కమిటీ) చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్క కాగా, ఇందులో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, హర్కర వేణుగోపాల్, బల్మూరి వెంకట్‌కు, 41 మందితో కూడిన ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీలో పొన్నం ప్రభాకర్, డి.శ్రీధర్‌బాబు, కటకం మృత్యుంజయంకు అవకాశం కల్పించారు. వివిధ అనుబంధ సంఘాల నుంచి 11 మందిని శాశ్వత ఆహ్వానితులుగా పేర్కొనగా, ఇందులో ఆరెపల్లి మోహన్, నేరెళ్ల శారద తదితరులకు జిల్లా నుంచి అవకాశం దక్కింది.

మెనిఫెస్టో, ప్లానింగ్‌ కమిటీల్లో మనోళ్లు.. ఎల్‌డీఎంఆర్‌సీ చైర్మన్‌గా ఆరెపల్లి మోహన్‌..
మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, కో చైర్‌పర్సన్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కన్వీనర్‌గా బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమించగా, ఈ కమిటీలో ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన నలుగురికి అవకా శం కల్పించారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, డాక్టర్‌ గీట్ల సవితా రెడ్డి, హర్కర వేణుగోపాల్, సయ్యద్‌ అస్మతుల్లా హుస్సేన్‌ను నియమించారు. స్ట్రాటజీ, ప్లానింగ్‌ కమిటీలో మాజీ మం త్రులు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌తోపాటు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌లో చేరిన సీహెచ్‌ విజయరమణా రావుకు అవకాశం కల్పించారు. ఎల్‌డీఎంఆర్‌సీ కమిటీకి మాజీ విప్‌ ఆరెపల్లి మోహన్‌ను చైర్మన్‌గా, హర్క ర వేణుగోపాల్‌ను కన్వీనర్‌గా నియమించారు. తొమ్మిది మందితో కూడిన ఎలక్షన్‌ క మిషన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి కాగా మాజీ ఎమ్మెల్సీ, జిల్లాకు చెందిన బి.కమలాకర్‌రావును కో చైర్‌పర్సన్‌గా నియమించారు. ఏడుగురు సభ్యుల డిసిప్లీనరీ కమిటీలో కూడా బి.కమలాకర్‌రావును కన్వీనర్‌గా నియమించారు.

పలువురు సీనియర్ల విస్మరణ..
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ, టీపీసీసీ కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెంది న పలువురికి అవకాశం కల్పించినా.. ఇంకొందరు సీనియర్ల ఊసే మరిచారు. పక్క జిల్లాలో పార్టీ మారిన నేతల పేర్లను రెండు, మూడు కమి టీల్లో వేసిన అధిష్టానం.. జిల్లాకు చెందిన పలు వురు సీనియర్లను విస్మరించిందన్న వాదన ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. అధికార ప్రతి నిధిగా ఉన్న ప్యాట రమేష్, మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బొమ్మ వెంకటేశ్వర్, సీనియర్‌ నాయకులు సుద్దాల దేవయ్య, కేకే మహేందర్‌రెడ్డి, కొమిరెడ్డి రామ్‌లు, జెడ్పీ మాజీ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కొలగాని మహేశ్‌తోపాటు పలువురి పేరుŠల్‌ కమిటీల్లో కనిపించ లేదు. కీలకమైన ఈ కమిటీల్లో పలువురిని విస్మరించడంపై పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

గతంలో నిర్వహించిన పదవులు : 2009 నుంచి 2014 వరకు పార్లమెంట్‌ సభ్యులు, కాంగ్రెస్‌ పార్లమెంటరీ సభ్యుల ఫోరమ్‌ కన్వీనర్‌ (ఉమ్మడి రాష్ట్రంలో), ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ (2005–2009), పీసీసీ మీడియా కో ఆర్డినేటర్‌ (2002–2004), యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(2002–2003), ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు (1999–2002), ఎన్‌ఎస్‌యూఐ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు (1992–1998), ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి (1989–1991), ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి (1987–1989), ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి విభాగం అధ్యక్షుడు(1987–88).  

మరిన్ని వార్తలు