రైతులు కష్టాల్లో ఉంటే ఆర్భాటాలా?

28 Apr, 2017 03:15 IST|Sakshi
రైతులు కష్టాల్లో ఉంటే ఆర్భాటాలా?

మాజీ ఎంపీలు పొన్నం, మధుయాష్కీ ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంక్షోభంలో ఉంటే.. వారిని ఆదుకోవడాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ప్లీనరీలు, బహిరంగ సభల పేరిట వృథా చేస్తూ ఆర్భాటాలకు పోతోందని కాంగ్రెస్‌ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ మండిపడ్డారు. గురువారం వారు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. మూడేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు ఏం మేలు చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక విషయాల్లో మొట్టికాయలు వేసిన విషయం అందరికీ తెలుసన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా విడుదల చేసిన 19 జీవోలను న్యాయస్థానాలు కొట్టేశాయని వారు గుర్తు చేశారు. మూడేళ్లలో ప్రభుత్వం 12 వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందన్నారు. అందుకే నిరుద్యోగుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో సీఎం కేసీఆర్‌ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించకుండానే వెనుదిరిగారని విమర్శించారు.

మరిన్ని వార్తలు