‘మిడ్‌ మానేరు’ ఎందుకు నింపడం లేదు'

26 Sep, 2019 08:19 IST|Sakshi

పొన్నం ప్రభాకర్‌

సాక్షి, చొప్పదండి : మిడ్‌మానేరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 25 టీఎంసీలు కాగా కేవలం 15 టీఎంసీల నీరు చేరడంతోనే అర్ధరాత్రి 25 గేట్లు తెరిచి ఆదరాబాదరగా ఎల్‌ఎండీకి నీరు ఎందుకు విడుదల చేశారో జవాబు చెప్పాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం, రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్‌ తదితర కాంగ్రెస్‌ ప్రతినిధులతో కలిసి మండలంలోని మాన్వాడ వద్ద మిడ్‌మానేరు ప్రాజెక్టు కుడివైపు కట్ట పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో నిండి నీరు ఓవర్‌ ఫ్లో అయి వృథాగా పోతున్న సందర్భంలో అట్టి నీటిని మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి ఎందుకు వదలడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు గల కారణాన్ని తెలుసుకునేందుకే కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం కట్ట భద్రతపై ప్రాజెక్టు సందర్శనకు వచ్చినట్లు తెలిపారు. కాగా కట్ట మీద వాస్తవ పరిస్థితి చూస్తే బోర్లు వేసి టెస్ట్‌లు చేస్తున్నారు. మొత్తం బురద వస్తుంది. కట్టపైన బోగం ఒర్రె పరిసరాల్లో కిలోమీటర్‌ మేర కట్ట పునర్మించాలని పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం, రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్‌లు మాట్లాడుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆగస్టు 30 నిర్వాసితుల మహాసభ చేపట్టిన రోజు కట్ట తెగుతుందనే భయంతో ఆదరాబాదరగా గేట్లు ఎత్తారన్నారు. బోగం ఒర్రె పరిసరాల్లో కట్ట మరమ్మతులు చేసిన క్రమంలో రాత్రికి రాత్రి మూడు మీటర్ల మేర కట్ట నిర్మించే పనులు చేపట్టి పాడుపడ్డ  మట్టి, పెద్ద పెద్ద మొద్దులు వేసి నాసిరకంగా నిర్మించారని దాంతో లీకేజీ వస్తుందన్నారు.

మిడ్‌మానేరు కట్ట నాణ్యతపై రాష్ట్రస్థాయి ఇంజినీర్లతో విచారణ చేయించాలని కోరారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కట్ట నాణ్యంగా ఉంటే వెంటనే 25 టీఎంసీల నీరు మిడ్‌మానేరు ప్రాజెక్టులో నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నాయకులు సంగీతం శ్రీనివాస్, కూస రవీందర్, బండి శ్రీనివాస్, పిల్లి కనుకయ్య, వేసిరెడ్డి దుర్గారెడ్డి, వన్నెల రమణారెడ్డి, భీంరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, మొగులోజి శ్రీకాంత్, ఎండీ.బాబు, నాగుల వంశీ పాల్గొన్నారు. 

చిన్న సీఫేజ్‌ అబ్జర్వ్‌ చేశాం
వీటిపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ జేఈతో మాట్లాడారు. దానికి జేఈ వేణుగోపాల్‌ జవాబిస్తూ ప్రాజెక్టులో టూ థర్డ్‌ వాటర్‌ ఫిల్లింగ్‌ అయ్యాక టెక్నికల్‌ వాక్‌త్రూలో సీఫేజ్‌ అబ్జర్వ్‌ చేసినట్లు పేర్కొన్నారు. అది లిమిట్‌లో ఉందని తెలిపారు. సీఫేజీలు ఉండడం  సాధారణమన్నారు. డ్యాం పటిష్టతపై  మంచిగా ఉండాలని ఈఆర్‌టీ, ఎస్‌ఆర్టీ టెస్ట్‌ చేయించామన్నారు. డౌన్‌ స్ట్రీమ్‌లో 20, 30 మీటర్ల తర్వాత సీఫేజీ గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీన్ని ఢిల్లీ పర్సా టెక్నాలజీ వారు చూశారు. వారు ఈఆర్‌టీ, ఎస్‌ఆర్‌టీ టెస్టులు చేశారని తెలిపారు. దీంతో బండ్‌ ఫిజికల్‌గా ఎంత ఫిట్‌గా ఉందో తెలుస్తుందన్నారు. 300 మీటర్ల మేర సీఫేజ్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందుకోసం 9 ఫీజో మీటర్లు ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఒక వారంలో ఫీజో మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు