సమ్మె విరమణ సమయంలో హల్‌చల్‌ చేస్తారా? 

23 Nov, 2019 04:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం 48 రోజులుగా సమ్మె చేస్తే కేంద్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేని బీజేపీ నేతలు సమ్మె విరమణకు వచ్చిన తరుణంలో ఏదో చేసినట్లు నటిస్తూ హల్‌చల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్నా బీజేపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కేంద్ర మంత్రి గడ్కరీ.. సీఎం కేసీఆర్‌ కోసం ఫోన్‌ చేస్తే ఆయన కలవలేదని బీజేపీ నేతలు చెప్తున్నారని, అది వారికే సిగ్గుచేటన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పట్టినట్లు నటిస్తున్నాయని విమర్శించారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు సందర్శనకు తీరిగ్గా వెళ్లిన ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ ప్రాజెక్టు లీకేజీలకు బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అని అనడాన్ని పొన్నం తప్పుబట్టారు. కాంగ్రెస్‌ హయాంలో తప్పు జరిగితే అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ విచారణ జరిపి ఎం దుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు