ఆ మృగాలని చంపి నేను జైలుకెళ్తా: పూనంకౌర్‌

30 Nov, 2019 18:39 IST|Sakshi

హైదరాబాద్‌: వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకను దారుణంగా హత్యచేసిన మృగాలను చంపేయాలంటూ ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంటే.. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు సైతం తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ ఘటనపై  సినీ నటి పూనమ్‌కౌర్‌ స్పందిస్తూ.. ఇలాంటి జంతువులను చంపడానికైనా తాను సిద్ధమేనని అన్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఆ మృగాలకు జైలు శిక్ష అనుభవించడం కాదు, వాళ్లను చంపి నేను జైలుకెళతాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల్లో ఒక వ్యక్తి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మతమనేది సమస్య కానేకాదని స్పష్టం చేశారు. అడవుల్లో అయినా కాస్త మేలేమో, కానీ ఈ జనారణ్యంలోనే కొందరు మనుషులు అతిభయంకరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి కానీ మత, రాజకీయ రంగులు పులిమి తప్పదోవ పట్టించొద్దని కోరారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో ఓ వీడియోని పోస్ట్‌ చేశారు. కాగా.. నిందితులను షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి చర్లపల్లి జైలుకు తరలించే క్రమంలో జనం ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేసుకుంటూ స్టేషన్‌లోకి వచ్చేందుకు యత్నించారు. ప్రియాంకారెడ్డి హత్యను న్యాయవాదులు కూడా తీవ్రంగా ఖండించారు. నిందితులకు ఎటువంటి న్యాయసహాయం అందించకూడదని నిర్ణయించుకున్నారు.

మరిన్ని వార్తలు