పార్టీ మారితే చావుడప్పు కొడతాం : పొన్నం

23 Dec, 2018 13:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాఫెల్‌ కుంభకోణంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ‍ప్రజలను మోసం చేసేందుకే విభజన హామీలపై పోరాడుతున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎంపీలు నటిస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాఫెల్‌ కుంభకోణంలో వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రూ.526 కోట్లకు వచ్చే విమానాలను 1600 కోట్లకు ఎందుకు కొన్నారో తెలపాలని పొన్నం డిమాండ్‌ చేశారు. రాఫెల్‌ తయారికి హెచ్‌ఎఎల్‌లాంటి నవరత్న కంపెనీని కాదని ఎలాంటి అనుభవంలేని రిలయన్స్‌ కు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

సమావేశంలో పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ‘‘రాఫెల్‌ విషయంలో కేం‍ద్రం సుప్రీంకోర్టును తప్పదోవ పట్టించింది. రాఫెల్‌ ఒప్పందంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఇక దుకాణం మూసుకోవాలి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించకుండా కేసీఆర్‌ ఫ్రెంట్‌ కోసం తిరుగుతున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస​ పార్టీ ఎమ్మెల్యేల కోసం చూస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో సమర్థులు లేరా?. శాసనమండలి సభ్యులను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం సరికాదు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతల ఇంటి ముందు చావు డప్పుకొట్టి శవయాత్రలు చేయాలని పార్టీని కోరాను. ఓటమితో మేం కుంగిపోలేదు. ఓటమికి కారణలేంటో విశ్లేషిస్తున్నాం. రాష్ట్రపతి రాక కోసం ఖర్చుపెట్టిన ఆరు కోట్లతో ఆసుపత్రి నిర్మించి ఉంటే ప్రజలకు ఉపయోగపడేది.


 

మరిన్ని వార్తలు