అభివృద్ధి పేరుతో అంతం చేస్తారా?

17 Sep, 2019 10:13 IST|Sakshi
మాట్లాడుతున్న జీఎస్‌పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి

ఆదివాసీలను కనుమరుగు చేసేందుకు, సంపదను దోచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర

అలాంటి ప్రయత్నాలు తక్షణమే మానుకోవాలి  

గోండ్వానా సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి

చర్ల: అభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ తెగలను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నాయని గోండ్వానా సంక్షేమ పరిషత్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి ఆరోపించారు. సోమవారం చర్లలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ములుగు జిల్లా అధ్యక్షుడు వాసం నాగరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. ఆదివాసీ తెగలను అందమొందించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని ఆరోపించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. నల్లమల ప్రాంతం రెండు రాష్ట్రాలు, ఆరు జిల్లాల నైజర్గిక స్వరూపాన్ని కలిగి ఉండగా 1961 జనాభా లెక్కల ప్రకారం ఆ ప్రాంతంలో ఆదిమ జాతి తెగలలోని చెంచు కులస్తులు సుమారు 45 వేల మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ప్రభుత్వాల వ్యవహార శైలి వల్ల 10 వేలకు పడిపోయిందని ఆరోపించారు. ఆదిమ తెగలను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆదివాసీ తెగలు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఉన్న 10 వేల మంది ఉన్న చెంచు తెగలో కేవలం 150 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రమే ఉన్నారంటే ఆ తెగను ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేస్తుందో గ్రహించవచ్చని ఆయన అన్నారు. యురేనియం తవ్వకాలు చేపట్టాలని యోచిస్తున్న నల్లమల అటవీ ప్రాంతం రెండు రాష్ట్రాలు, ఆరు జిల్లాలను కలుపుకుని విస్తరించి ఉండగా ఆ అటవీ ప్రాంతంలో 250 రకాల పక్షిజాతులు, వేలాది రకాల ఆయుర్వేద మొక్కలు ఉన్నాయని అన్నారు. యురేనియం తవ్వకాల వల్ల వీటి మనుగడ లేకుండా పోతుందని ఆయన అన్నారు. యురేనియం తవ్వకాల ఇటువంటి నష్టాలు కలుగనున్న నేపథ్యంలో పర్యావరణ శాస్త్రవేత్తలు ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో గతంలో మంచినీటి పరీక్షల పేరుతో 40 బోర్లు వేశారని మళ్లీ కేంద్ర ప్రభుత్వం 2 వేల ఎకరాల్లో 4 వేలకు పైగా బోరు వేసి భూగర్భంలో ఉన్న యురేనియాన్ని బయటకు తీయాలని చూస్తోందని అన్నారు.

యురేనియం తవ్వకాలు చేపట్టడం వల్ల అటవులు అంతమవ్వడంతో పాటు అటవీ ప్రాంతాల్లో జీవనాన్ని కొనసాగిస్తున్న చెంచు తెగ అంతరించిపోతుందని అన్నారు. తక్షణమే అలాంటి ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఖనిజ సంపదను దోచుకోవడాన్ని బుర్జువా రాజకీయ వేత్తలు కుట్రలు చేస్తున్నారని వీటిని ప్రతీ ఆదివాసీ ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని లేకుంటే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన పిలుపునిచ్చారు. గిరిజనేతరలు స్వాధీనంలోకి వెళ్లిన భూ వ్యవహరంపై రెవెన్యూ యంత్రాంగం తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ చట్టాలైన 1/70, పీసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రభుత్వాలు గుర్తించి వాటిని కాపాడాలని అన్నారు. ఇత్తు పండగ, కొత్తల పండగలకు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు