సమస్యల్లో ‘సంక్షేమం’ 

19 Feb, 2018 15:00 IST|Sakshi

ఇరుకు గదులు.. నేల చదువులు..

తాగునీటి కొరత.. విద్యుత్‌ వెతలు  

ఇబ్బంది పడుతున్న మూడువేల మంది విద్యార్థులు 

నాలుగు గురుకులాలు అద్దె భవనాల్లోనే

ఇల్లెందు : జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. అనేక పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేవు. ప్రధానమైన తాగునీటి సౌకర్యం లేదు. డైనింగ్‌ హాళ్లు, బంకర్‌ బెడ్లు, డార్మెటరీ, మరుగుదొడ్లు, విద్యుత్‌ వంటి కనీస వసతులు కరువయ్యాయి. విద్యార్థులకు పోషకాహారం కూడా సక్రమంగా అందడం లేదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం భద్రాచలం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 12 మంది బాలికలు అస్వస్థతకు గురైన విషయం విదితమే. జిల్లాలో 9 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో 3720 సీట్లు ఉండగా, ప్రస్తుతం సుమారు 3000 మంది చదువుతున్నారు. ఈ తొమ్మిదింటిలో ఐదు పాతవి, నాలుగు కొత్తవి ఉన్నాయి. నూతన గురుకులాల్లో నూటికి నూరు శాతం సమస్యలు తాండవిస్తున్నాయి.  

ఇంటర్‌ వరకు ఇంగ్లిష్‌ మీడియం బోధన.. 
భద్రాచలంలో బాలికలకు, మణుగూరులో బాలుర కోసం 5 నుంచి ఇంటర్‌ వరకు ఇంగ్లిష్‌ మీడియంలో గురుకులాలు ఏర్పాటు చేశారు. పాల్వంచలో మాత్రం డిగ్రీ కళాశాల ఉంది. ఇల్లెందులో ప్రస్తుతానికి 5 నుంచి 7వ తరగతి వరకే ఉన్నాయి. మణుగూరు, పాల్వంచ, భద్రాచలంలో రెండేళ్ల క్రితం, ఇల్లెందులో ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ఒక్కో తరగతిలో 70 మంది(సెక్షన్‌కు 35 మంది చొప్పున) ఉన్నారు. గతంలో కొత్తగూడెంలో అద్దె భవనంలో ఉన్న డిగ్రీ కళాశాలను ఇప్పుడు పాల్వంచకు మార్చారు. ఇక్కడ 440 సీట్లు ఉండగా, 294 మంది మాత్రమే చదువుతున్నారు.  

అంతటా అరకొర వసతులే.. 
జిల్లాలోని గురుకులాల్లో సమస్యలు తిష్ట వేశాయి. ఇల్లెందులో భవనం లేక మంజూరైనా ఒక ఏడాది పాటు ఏర్పాటు చేయలేదు. ఈ విద్యాసంవత్సరంలో సింగరేణి రేడియో స్టేషన్‌ భవన్‌ను ఎంపిక చేయటంతో పాఠశాలను ప్రారంభించారు. అందులో 22 గదులుండగా 20 గదులు గురుకులానికి ఇచ్చారు. కిందనున్న గదుల్లో తరగతులు, పైన నివాసం కోసం కేటాయించారు. మణుగూరు, భద్రాచలంలో ఏర్పాటు చేసిన గురుకులాలకు సైతం సొంత భవనాలు లేవు. పాల్వంచలో ఉన్న గురుకులం గత ఏడాది వరకు కొత్తగూడెంలో అద్దె భవనంలో కొనసాగింది. ప్రస్తుతం పాల్వంచలో పాత భవనంలో కొనసాగుతున్నా కొత్తగూడెం లో భవనం పూర్తికాగానే తిరిగి అక్కడికి మార్చు తారు. కాగా, అద్దె భవనాల్లో అరకొర సదుపాయాలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ఏ ఒక్క చోటా డార్మెటరీలు, డైనింగ్‌ హాళ్లు, బంకర్‌బెడ్లు, కిచెన్‌షెడ్డు లేవు. మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ సమస్యలు తీవ్రంగా పీడిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు మాత్రమే రెగ్యులర్‌ వారు కాగా ఉపాధ్యాయులు, సిబ్బంది అంతా కాంట్రాక్ట్‌ వారే. 

మెనూ అమలు తీరు ఇలా... 
విద్యార్థులకు ప్రతిరోజూ ఒకరమైన టిఫిన్, పాలు, బూస్ట్, నూడిల్స్‌ వంటి అల్పాహారాలతో పాటు నాణ్యమైన భోజనం అందించాలి. కానీ అవన్నీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. మటన్, చికెన్‌ నాణ్యత విషయాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంట్రాక్టర్‌లు వాటిని సకాలంలో తేకపోవడంతో హడావిడిగా ఉడికీ, ఉడకని వంటలు అందిస్తున్నారు. పాలు, పెరుగు విషయంలో కొలమానాలు పాటించటం లేదు. నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు పెట్టడం లేదు. ఇక ఫిల్టర్‌ చేసిన నీరు లభించటం కూడా కష్టంగానే మారింది. ఫలితంగా ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు.

పర్యవేక్షణ పెంచుతాం  
జిల్లాలోని అన్ని గురుకులాలను త్వరలో సందర్శించి పర్యవేక్షణ పెంచుతాం. ప్రిన్సిపాల్‌లు ఎక్కడికక్కడే సదుపాయాలు కల్పించుకోవాలి. అపరిశుభ్రంగా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తగు చర్యలు తీసుకుంటాం. సొంత భవనాలు లేక పోవటం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. రానున్న కాలంలో అన్ని గురుకులాలకు సొంత భవనాలు అందుబాటులోకి వస్తాయి. అద్దె భవనాల్లో ఉన్నప్పటికీ ఈ నెలాఖరు నాటికి సకల సదుపాయాలు కల్పిస్తాం. ప్రభుత్వం ఇప్పటికే మెనూ అమలుతో పాటు సదుపాయాల కల్పన మీద దృష్టి సారించింది. 
– కె.అలివేలు, ప్రిన్సిపాల్, డీసీఓ

మరిన్ని వార్తలు