నిరీక్షణకు మోక్షం

25 Feb, 2019 11:07 IST|Sakshi

ఖానాపురం: పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఎంతో మంది రైతులకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హక్కుపత్రాలిచ్చి దేవుడయ్యారు. ఆయన మరణం అనంతరం పోడు రైతులకు పట్టాలిచ్చే నాథుడే కరువయ్యారు. గతంలో ప్రభుత్వ ఆదేశాలతో ఫారెస్ట్‌ అధికారులు పోడు రైతులకు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. వాటిని ఎదుర్కొంటూ కష్టపడి సాగు చేసుకున్న భూములను వదిలిపెట్టలేదు. కుటుంబానికి భరోసాగా ఉండే భూములనే నమ్ముకొని పట్టాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రస్తుత అధికారులు అండగా నిలుస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 15 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో ప్రధానంగా ఖానాపురం, నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నారావుపేటతో పాటు ఇతర మండలాల్లో పోడు భూములను అనేక మంది రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రైతులకు అనేక పథకాలను తీసుకువచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు రైతుల విషయంలో ఫారెస్ట్‌ అధికారులతో ఉక్కుపాదం మోపించారు. నూతనంగా పోడు భూములను సాగు చేయనీయకుండా కేసీఆర్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. దీంతో పోడు రైతులు భయాందోళనకు గురవుతూ గతంలో పోడు చేసుకున్న భూములను మాత్రమే సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరంత హక్కు పత్రాల కోసం నిరీక్షిస్తున్నారు.

జిల్లాలో 171 మందికి మంజూరు..
పోడు సాగు చేసుకోని జీవనం సాగిస్తున్న రైతులకు పట్టాల కోసం ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. వారి నిరీక్షణకు డీఎల్‌సీసీ కమిటీ, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిలు ఊరట కల్పించారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి భారీగా పోడు రైతులకు పట్టాలు మంజూరి చేసి పొడు రైతుల గుండెల్లో నిలిచిపోయాడు. నాటి నుంచి నేటి వరకు ఎవరికీ పట్టాలు మంజూరి కాలేదు. తాజాగా 13–12–2005 కంటే ముందు పోడు సాగు చేసుకుంటున్న వారికి పట్టాల కోసం డీఎల్‌సీసీ కమిటీ ద్వారా 261 మందికి నివేదికలు రాగా 171 మందికి హక్కుపత్రాలు  మంజూరు చేశారు. మిగతా 90 మందిని రిజెక్ట్‌ చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో హక్కుపత్రాలు మంజూ రైన రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

అటవీ అధికారులకు సహకరించాలి.. 
171 మందికి హక్కు పత్రాలు మాత్రమే కల్పించడం జరిగింది. హక్కుపత్రాలు కల్పించిన భూముల్లో యంత్రాలు, కరెంట్‌ను వాడొద్దు. వర్షపు నీటిపై ఆధారపడి మాత్రమే పంటలు పండించుకోవాలి. అడవులకు ఎలాంటి నష్టం కలిగించొద్దు. పత్తి, మిర్చి లాంటి పంటలు పండించొద్దు. హక్కుపత్రాలు వచ్చిన భూముల చుట్టూ అడవులను కాపాడాలి.  – కాసిపేట పురుషోత్తం, డీఎఫ్‌ఓ, వరంగల్‌ రూరల్‌  

మరిన్ని వార్తలు