అమ్మో ఒకటో తారీఖు

31 Mar, 2020 08:02 IST|Sakshi
జోగిపేటలో అద్దె దుకాణాలు

ఆర్బీఐ ప్రకటన.. కొందరికే ఊరట

జిల్లాలో వేలాది మంది చిరు వ్యాపారులు

ప్రైవేట్‌ రుణాలపై దిగాలు

నెలసరి కిస్తీలు చెల్లించడంపై ఆందోళన

అద్దె చెల్లించేదెలా అంటూ ఆవేదన

కుటుంబాలను పోషించుకోవడానికి కొందరు.. బతుకుదెరువు కోసం మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొందరు బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థల్లో నెలసరి కిస్తీలు చెల్లించడానికి తమకు లభించిన వ్యక్తులు, సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. డెయిలీ ఫైనాన్స్‌ కింద తీసుకున్న వారు రోజూ చెల్లించాల్సి ఉంటుంది. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడంతో పేదలు, చిరువ్యాపారులు  ఏప్రిల్‌ ఒకటో తేదిన వాయిదాలు చెల్లించడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు.

జోగిపేట(అందోల్‌):  కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికై ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఆదివారం నుంచి మార్కెట్‌ స్తంభించింది. ముందుగా ఈనెల 31వ వరకే అని చెప్పిన ప్రభుత్వం పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల దృష్ట్యా ఏప్రిల్‌ 14వ తేది వరకు లాక్‌డౌన్‌ పొడగించగా, శుక్రవారం ముఖ్యమంత్రి ఏప్రిల్‌ 15వ వరకు పొడగిస్తూ ప్రకటన చేశారు. ఇంకా ముందుకు పొడగించే అవకాశం లేకపోలేదని అధికార యంత్రాంగం భావిస్తుంది. ఫలితంగా రోజు వారీ కూలీ చేసుకునే బతుకులు, దుకాణాలను అద్దెకు తీసుకొని పానడబ్బాలు, సెల్‌ఫోన్‌ షాపులతో పాటు ఇతర చిరు వ్యాపారాలు చేసుకునే వారు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌లలో రుణాలు పొందారు. ఇక మద్య తరగతి కుటుంబాలు మొదలుకొని నిరుపేద వర్గాలు కూడా కిస్తుల రూపంలో సెల్‌ఫోన్‌లు, గృహాలంకరణ వస్తువులు, మరికొందరైతే క్రెడిట్‌ కార్డులతో వాయిదాల పద్దతిలో వస్తువులు, రుణాలు పొందారు. వీరంతా తమ అకౌంటు ద్వారా ప్రతినెలా మొదటి వారంలో రుణాలు తీసుకున్న బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థలకు తప్పనిసరిగా కిస్తులు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా వారం రోజులకుపైగా మార్కెట్‌ మూసి ఉంటుంది. ఈ క్రమంలో రుణ గ్రహీతల ఉపాధితో పాటు ఆదాయం కోల్పోయారు. పనిచేస్తేనే కానీ నెలసరి కిస్తులు చెల్లించే వీరు ఇప్పుడు ఏప్రిల్‌ 1న తమ నెలసరి వాయిదాలను కట్టడానికి మార్గం లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 

కొందరికే ఊరట..
శుక్రవారం ఆర్బీఐ ప్రకటన ఉద్యోగస్తుల్లో ఊరట కలిగించగా, ప్రైవేట్‌ వ్యక్తుల, చిరు వ్యాపారులు, నిరుపేదలను ఊగిసలాటకు గురి చేసింది. మొదటి తేదీన కిస్తీలు చెల్లించాలా.. వద్దా అనే మీమాంస చాలా మందిలో నెలకొంది. ఆర్బీఐ అన్ని రకాల రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో గృహ నిర్మాణ రుణాలు, బ్యాంకుల నుంచి పొందిన ఓవర్‌డ్రాఫ్టులు తదితర కొన్నింటికే మారటోరియం వర్తిస్తుందన్న ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు నెల సరి జీతాలు బ్యాంకు అకౌంట్లోకి నేరుగా వస్తుండగా, పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసే వారికి బ్యాంకులు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సిస్టం ద్వారా తీసుకున్న అప్పులపై ఆర్బీఐ విధిస్తున్న మారటోరియంతో ఆయా వర్గాలకు ఊరట లభించింది. అయితే క్రెడిట్‌ కార్డులపై తీసుకున్న నగదు రుణాలు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు ధని, బ్యాంకు బజార్‌ తదితరాల నుంచి పొందిన రుణగ్రస్తులు నెలసరి కిస్తీలు చెల్లించడానికి ఇంట్లోంచి బయటకు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. 

చిరు వ్యాపారులకు అద్దె భయం..
జిల్లాలోని అన్ని పట్టణాల్లో చిరు వ్యాపారులు చేస్తూ అద్దె చెల్లిస్తున్నారు. వీరికి ప్రస్తుతం  ఉపాధి లేదు. ఏప్రిల్‌ ఒకటో తేదీ సమీపిస్తుండడంతో అద్దెల చెల్లించడంపై ఆందోళన చెందుతున్నారు. 

ప్రభుత్వం ఊరటనిచ్చినా..
రుణ వాయిదాల చెల్లింపులపై ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తుందా? అని చాలా మంది రుణగ్రహీతలు ఆశతో ఉ న్నారు. మారటోరియం హోం, కార్లు పర్సనల్‌ లోన్లు తీసుకున్న వాటికి వర్తిస్తుందని ఆర్బీఐ చెప్పినా బ్యాంకు అధికారులకు స్పష్టమైనా దేశౠలు రాకపోవడంతో రుణ  గ్రహీతలను ఆందోళనలో నెట్టింది. ఆదేశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇంకా రాని మార్గదర్శకాలు  
మారటోరియం గృహాలు, కార్లు వాహనాలు పర్సనల్‌ లోన్లకు వర్తిస్తాయి. కానీ క్రెడిట్‌ కార్డు బిల్లులు కట్టనవసరం లేదని ఆర్బీఐ నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రా లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు. రెండు రోజుల్లో అన్ని రకాల రుణాలపై స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థల్లో రుణాలపై మారటోరియం ఉంటుందా? లేదా అనే విషయం తెలియదని తదుపరి ఉత్తర్వులు కోసం ఎదురు చూస్తున్నట్లు వారు చెబుతున్నారు.  

అద్దె కట్టడం ఇబ్బందే..
వ్యాపారం నడవకున్నా దుకాణాల అద్దెలు మాత్రం చెల్లించాల్సిందే. వారం రోజులుగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా స్వీయ నిర్బంధం పాటించాలని ప్రభుత్వం ప్రకటించడం, కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో దుకాణాలు మూసి ఉంచాం. అద్దెలు కట్టాలంటే ఇబ్బందులు తప్పవు. యజమానులు కొంత ఆలస్యంగా అద్దెలు తీసుకునేందుకు సహకరిస్తే ఇబ్బందులు ఉండవు. చిరు వ్యాపారస్తులు డైయిల్‌ చెల్లించేందుకు తీసుకున్న అప్పులను మాత్రం చెల్లించడం కష్టమే.  – బచ్చు ఆనంద్, చిరువ్యాపారి, జోగిపేట

మరిన్ని వార్తలు