పేదలకు 'కరోనా' పరీక్ష!

15 Apr, 2020 13:17 IST|Sakshi

ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర సరుకుల ధరలు

ఆదాయం లేదు.. ఉన్న డబ్బులూ ఖర్చయిపోతున్నాయ్‌  

ఉమ్మడి జిల్లాలోని సామాన్యులకు గడ్డు పరిస్థితి తప్పదా?

కుటుంబ సభ్యులను పోషించుకోవడం కష్టమే..

ప్రభుత్వ ఫలాలుసగటు మనిషికి సరిపోని వైనం

ప్రాణాలు రక్షించుకోవాలంటే ఈ లాక్‌డౌన్‌ తప్పదు

మహబూబ్‌నగర్‌ క్రైం: కేంద్రం ప్రభుత్వం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించడంతో మరో 18రోజుల పాటు జనాలు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈనెల 20 వరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేసి ఆ తర్వాత దశల వారీగా అత్యవసర సేవలు, ఇతర వాటికి అనుమతి కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో ఇప్పటికే 20రోజుల నుంచి ఎలాంటి పనులు లేకపోవడం వల్ల చాలా మంది పేదలు తినడానికి ఆహారం, కూరగాయలు, కనీస అవసరాలకు సరిపడా నగదు లేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా దినసరి కూలీలు, మధ్యతరగతి వారు, కార్మికులు, ప్రైవేట్‌ సంస్థలు, కంపెనీల్లో రోజు కూలీలుగా పనిచేసే ఎంతోమంది లాక్‌డౌన్‌తో మూడు పూటలా భోజనానికి దూరమయ్యారు. ఒకవైపు నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కిలో కందిపప్పు రూ.120, మినపప్పు రూ.150, చింతపండు రూ.240, అల్లం రూ.140, వెల్లుల్లి రూ.160, వంటనూనె రూ.130కి విక్రయిస్తున్నారు. ధరలు ఇలాగే ఉంటే సగటు మనిషి పచ్చడి మెతుకులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. తాజాగా పెరిగిన లాక్‌డౌన్‌తో ఎన్నో కుటుంబాలు మూడు పూటలు తినడానికి సరైన ఆహారం లేక అవస్థలు పడే అవకాశం ఉంది. 

అవస్థలు తప్పవా?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 44లక్షల జనాభా ఉంది. వీరిలో రైతులు, వలస కూలీలు, రోజువారీ కూలీలు, ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేసే సిబ్బంది, కార్మికులు ఇలా సామాన్యులే అధిక సంఖ్యలో ఉన్నారు. దీంట్లో చాలా వరకు ఒకరోజు పని చేయకపోతే ఆరోజు మొత్తం ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఉపవాసం ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 20రోజుల పాటు ఎలాంటి ఆదాయం లేకపోగా, ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేశారు. రానున్న మరో 18రోజుల పాటు కుటుంబం మొత్తం బతకాలంటే కష్టసాధ్యమవుతోంది. ఈ క్రమంలో ఎలాంటి ఉపాధి లేక కుటుంబాలను ఎలా పోషించాలని వారు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో అక్కడక్కడా దాతలు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేస్తున్నా అవి రెండు మూడు రోజులకే సరిపోతున్నాయి. 

తప్పని లాక్‌డౌన్‌
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్‌ నుంచి మనుషుల ప్రాణాలు కాపాడుకోవాలంటే లాక్‌డౌన్‌ తప్పదు. బయట భౌతిక దూరం పాటించడంతో పాటు ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటే తప్పా ఈ వైరస్‌ను అదుపు చేయడం కష్టసాధ్యమే. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 34మంది కరోనా పాజిటివ్‌ బాధితులు ఉండగా దీంట్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇలాంటి సమయంలో ఈ వైరస్‌ను అడ్డుకోవాలంటే కష్టమైనా లాక్‌డౌన్‌ను పాటించక తప్పదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ లాక్‌డౌన్‌ విజయవంతానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. దీనికి ప్రజల  సహకారం ఎంతో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకుంటేనే కరోనాను అడ్డుకోవచ్చని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు