నాలా కాదు.. నిమ్స్‌ ఆస్పత్రే!

13 Dec, 2017 02:46 IST|Sakshi
నిమ్స్‌లో ప్రధాన గేటు ముందు పారుతున్న మురుగు నీరు

ప్రఖ్యాత ఆస్పత్రిలో అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాల్సిన హైదరాబాద్‌ ‘నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)’ఆస్పత్రి మురికి కూపంగా మారిపోయింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, డ్రైనేజీ లీకేజీలతో పారిశుధ్య లోపం తాండవిస్తోంది. ఇక్కడికి వస్తే అనారోగ్యం తొలగిపోవడమేమిటోగానీ కొత్త రోగాలు పట్టుకుంటాయన్నంతగా పరిస్థితి తయారైంది. నిమ్స్‌లో ఉన్నతాధికారులు, అధికారులు ఉండే ఆవరణలు శుభ్రంగానే ఉన్నా.. రోగులు, వారి సహాయకులు ఉండే ప్రదేశాలు మాత్రం దారుణంగా ఉంటున్నాయి. అసలు పారిశుధ్యం కోసం సుమారు నెలకు రూ. 2 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించకపోవడం ఆందోళనకరం. 

ఆవరణ నిండా మురుగునీరు 
నిమ్స్‌ ప్రభుత్వ పరిధిలోని వైద్య సేవల సంస్థ అయినా విశ్వవిద్యాలయం హోదాతో ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కీలకమైన వైద్య సేవలను ఇక్కడే పొందుతారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల ఖర్చులు భరించలేనివారు, ఆరోగ్యశ్రీ పరిధిలోని పేదలు నిమ్స్‌కు వస్తుంటారు. ఇలా అన్ని వర్గాలకు సేవలందించే నిమ్స్‌లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం గమనార్హం. రోజూ వేలాది మంది వచ్చే ఈ ఆస్పత్రి ఆవరణలో.. బహిరంగ నాలాలను తలపించేలా మురుగు నీరు ప్రవహిస్తోంది. కనీసం నడుచుకుంటూ వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలోకి వచ్చి, వెళ్లే మార్గాలు దుర్గంధభరితంగా మారిపోయాయి. అసలు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఇంతకుముందు ఈ ఆస్పత్రికి ‘స్వచ్ఛ ఆవరణ’అవార్డు ఇవ్వడం గమనార్హం. 

భరించాల్సిందే.. 
ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవల కోసం వచ్చే రోగులు, ఆస్పత్రిలో చేరిన వారికి సహాయకులుగా ఉండేవారితోపాటు రెసిడెంట్‌ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర సేవలు నిర్వహించే తాత్కాలిక సిబ్బంది అందరూ కూడా మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిపోక అవస్థలు పడుతున్నారు. ఓపీ కోసం వచ్చే రోగుల కోసమైతే ఒక్క చోట కూడా ఇవి అందుబాటులో లేవు. కింది అంతస్తులో ఒకటి రెండు మూత్రశాలలు ఉన్నా తాళాలు వేసి పెడుతున్నారు. దాంతో కొందరు రోగులు, సహాయకులు, ముఖ్యంగా మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు రోగులు, సహాయకులు ఆస్పత్రి ఆవరణలో కనుమరుగుగా ఉండే ప్రాంతాల్లో ‘పని’కానిచ్చేస్తున్నారు. 

రోగుల సంఖ్య పెరుగుతున్నా.. 
వాస్తవానికి నిమ్స్‌ ఆస్పత్రికి జాతీయ స్థాయిలో పేరుంది. వైద్యసేవల పరంగా రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలోనూ లేని విధంగా 34 విభాగాలున్నాయి. ప్రభుత్వం కూడా పడకల సంఖ్యను 1,140 నుంచి 1,460కి పెంచింది. రోగులు కూడా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల ఫీజులకు భయపడి నిమ్స్‌వైపే చూస్తున్నారు. దీంతో ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రోజూ సగటున 1,500 మంది ఔట్‌ పేషెంట్లు వచ్చేవారు. ఇప్పుడా సంఖ్య 2,500 మందికి పెరిగింది. రోజూ సగటున 150 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు, అన్నిరకాల శస్త్రచికిత్సలు కలిపి సగటున రోజూ 100 ఆపరేషన్లు జరుగుతున్నాయి. అయితే పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా భవనాలు నిర్మించుకుంటూ పోతున్నారుగానీ... ఇతర మౌలిక సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణను మాత్రం గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 

గ్రామాల నుంచి వచ్చేవారితోనే ఇబ్బంది 
‘‘నిమ్స్‌కు వచ్చే వారిలో ఎక్కువ మంది గ్రామీణులు ఉంటారు. ఆస్పత్రికి వచ్చేటప్పుడు మగ్గులు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులు తెచ్చి.. ఇక్కడే పడేస్తున్నారు. దీంతో అప్పుడప్పుడు డ్రైనేజీ సమస్యలు వస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల స్థాయిలో ఇక్కడ పారిశుధ్య నిర్వహణను ఆశించలేం. కానీ నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నంతలో మెరుగు పరుస్తున్నాం..’’ 
– కె.మనోహర్, నిమ్స్‌ డైరెక్టర్‌ 

మరిన్ని వార్తలు