రాహుల్‌తో గద్దర్‌ భేటీ

12 Oct, 2018 13:18 IST|Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ప్రజా గాయకుడు గద్దర్‌ భేటీ అయ్యారు. భార్య, కుమారుడితో కలిసి రాహుల్‌తో సమావేశమయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రాహుల్‌ ఈ సందర్భంగా గద్దర్‌ను కోరారు. ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీతో కలిసి రాహుల్‌తో గద్దర్‌ సమావేశమయ్యారు. మహాకూటమికి అనుకూలంగా ప్రచారం చేయనున్న గద్దర్‌కు ఉత్తర తెలంగాణ, సింగరేణి ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న తన కుమారుడు సూర్యకిరణ్‌కు పార్టీ తరపున బెల్లంపల్లి సీటుతో పాటు మరో ఇద్దరు అనుచరులకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గద్దర్‌ సీట్లు కోరుతున్నారు. బెల్లంపల్లి టికెట్‌ ఆశిస్తున్న సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ను పోటీ నుంచి తప్పించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కోరతారని భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్టానంతో గద్దర్‌ చర్చలు కొలిక్కిరానున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఆ బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకోవాలి: గద్దర్‌
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీలను మర్యాదపూర్వకంగా ప్రజా గాయకుడు గద్దర్‌ కలిశారు. గద్దర్‌తో పాటు ఆయన భార్య విమల, కుమారుడు సూర్యకిరణ్‌లు కూడా ఉన్నారు. అనంతరం గద్దర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్నతెలంగాణ ప్రస్తుతం ఫ్యూడల్‌ చేతుల్లోకి పోయిందని ప్రజా గాయకుడు గద్దర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగాలు చేసిన వారికి తెలంగాణ ఫలాలు చేరలేదని, ఫ్యూడల్‌ చేతుల్లో నుంచి తెలంగాణను విముక్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీపైనే ఉందని తెలిపారు. కవులు, కళాకారుల తరుపున తెలంగాణలో సోనియా గాంధీ పర్యటనను స్వాగతిస్తున్నామన్నారు. 

సోనియా దయ వల్లే
యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ దయవల్ల తెలంగాన రాలేదని సీఎం కేసీఆర్‌ అనడం భావ్యం కాదని గద్దర్‌ సతీమణి విమల పేర్కొన్నారు. దేశం కోసం సోనియా కుటుంబం త్యాగాలు చేసిందన్నారు. కేసీఆర్‌ ఆందోళనలు చేయడం వల్ల తెలంగాణ రాలేదని, ఎందరో విద్యార్థుల ప్రాణ త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. సోనియాపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.        


>
మరిన్ని వార్తలు