నిషేధించినా నెట్టింట..

26 Nov, 2018 02:21 IST|Sakshi

విచ్చలవిడిగా అశ్లీల సైట్లు 

స్పెల్లింగ్‌ మార్చి కొత్తవాటిగా చలామణీ 

సినిమా పైరసీ సైట్లదీ అదే దారి

సాక్షి, హైదరాబాద్‌: ‘శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు’అన్నారు పెద్దలు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అశ్లీల(పోర్న్‌), సినిమా పైరసీ సైట్ల నిర్వాహకులు ప్రస్తుతం ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో జరుగుతున్న పలు అత్యాచారాలకు కారణంగా నిలుస్తోన్న ఈ వెబ్‌సైట్లను నిషేధించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్‌ (డీవోటీ)కు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయినా తిమ్మిని బమ్మి చేసే ఆయా సైట్ల నిర్వాహకులు సైట్ల పేరులోని స్పెల్లింగ్‌లో కొద్దిపాటి మార్పు చేసి వీటిని చలామణిలోకి తీసుకొచ్చారు. తిరిగి ఎప్పట్లాగే ఇవి అందరికీ అందుబాటులోకి రావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. 

ఎందుకు నిషేధించారు..  
ఉత్తరాఖండ్‌ హైకోర్టులో ఇటీవల ఓ రేప్‌ కేసు విచారణకు వచ్చింది. స్కూలు విద్యార్థినిపై తోటి బాలుడు అత్యాచారానికి పాల్పడిన కేసు అది. తాను ఈ అఘాయిత్యానికి పాల్పడే ముందు పోర్న్‌ సైట్లు చూశానని ఆ బాలుడు కోర్టుకు చెప్పాడు. దీనిపై స్పందించిన కోర్టు అత్యాచారాలకు కారణమవుతోన్న ఇలాంటి అశ్లీల వెబ్‌సైట్లను వెంటనే నిషేధించాలని సెప్టెంబర్‌ 27న కేంద్రానికి ఆదేశాలిచ్చింది. నవంబర్‌ 15లోగా ఈ పనిని పూర్తి చేయాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు మంత్రిత్వ శాఖకు అక్టోబర్‌ 8న అందాయి. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్‌ (డీవోటీ)కు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా దేశంలో 827 పోర్న్‌ వెబ్‌సైట్లను గుర్తించి బ్లాక్‌ చేశారు. అంతేకాకుండా ఈ జాబితాలోని సైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రన్‌ చేయవద్దని ఇంటర్నెట్‌ సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చింది. వీటితోపాటు టెలికామ్‌ సంస్థలు కూడా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. 

నియంత్రణ కష్టమే.. 
‘మాకు ఆదేశాలు వచ్చిన వెంటనే మేం నిషేధాన్ని అమల్లో పెట్టాం. జాబితాలోని 827 అశ్లీల సైట్లను నిషేధించాం. కానీ, వారు తెలివైనవారు. ప్రపంచంలో ఏదో మూల నుంచి ఆపరేట్‌ చేస్తారు. తమ వెబ్‌సైట్‌కు వీక్షకులు తగ్గిన విషయం వీరికి తెలిసిన వెంటనే, ఐపీ అడ్రస్, వెబ్‌సైట్‌ చిరునామాలో స్వల్ప మార్పులు చేసి నెట్‌లో సులువుగా దొరికేలా చేస్తారు’అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ప్రైవేటు టెలికామ్‌ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. 

మనమే ఎందుకు లక్ష్యం..! 
భారత్‌లో జనాభా అధికం. ప్రపంచంలో రెండో స్థానం. జనాభాలో యువత దాదాపు 40 శాతం పైమాటే. దీనికితోడు భారత్‌లో పెరిగిపోతున్న ఇంటర్‌నెట్‌ యూజర్లు, మొబైల్‌ వినియోగదారులను ఈ వెబ్‌సైట్లు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఏడాది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్‌ (డీవోటీ) ఇచ్చిన నివేదిక ప్రకారం.. భారత్‌లో ప్రస్తుతం 46.36 కోట్లకుపైగా బ్రాడ్‌బాండ్‌ వినియోగదారులు ఉన్నారు. ఇది గతేడాదితో పోలిస్తే.. 0.74 శాతం అధికం. ఇక జూన్‌ 2018 నాటికి స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు 50 కోట్ల మంది వరకు ఉన్నారు. ఓ సంస్థ అందించిన రిపోర్టు ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పోర్న్‌ వీడియోలు చూసే దేశంలో 2015లో ఇండియా 4వ స్థానంలో ఉండగా, 2016లో 3వ స్థానానికి ఎగబాకింది. తొలి రెండు స్థానాల్లో బ్రెజిల్, ఫిలిప్పీన్స్‌ ఉన్నాయి.  

పేరు మార్చి మళ్లీ ప్రత్యక్షం..
పోర్న్‌ వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తారని ఆయా వెబ్‌సైట్ల నిర్వాహకులకు ముందే తెలుసు. అలాగే 2 వారాలుగా ఆన్‌లైన్లో వీటిని శోధించినా ఎవరికీ దొరకలేదు. దీంతో వీక్షకులు తగ్గిపోయిన విషయాన్ని ఆయా సైట్‌ నిర్వాహకులు గుర్తించారు. అందుకే వాటి ఐపీ అడ్రెస్‌లు, యూఆర్‌ఎల్‌ లింకులు, వెబ్‌సైట్‌ చిరునామా( డొమైన్‌ నేమ్‌) స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పులు చేసి తిరిగి రన్‌ చేస్తున్నారు. ఆ పాత సైట్లన్నీ స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పులతో తిరిగి నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. రాష్ట్రంలో అయితే దాదాపు 1,350 పోర్న్‌తోపాటు పైరసీ సినిమా వెబ్‌సైట్లను పోలీసులు గుర్తించి వాటిని నిషేధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వారు పేర్లు మార్చుకుని తిరిగి వస్తుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.  

>
మరిన్ని వార్తలు