హరీశ్‌కు ఆర్థికం

9 Sep, 2019 02:48 IST|Sakshi

కేటీఆర్‌కు పురపాలన, పరిశ్రమలు, ఐటీ

సీఎం వద్దే రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్‌ శాఖలు  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హరీశ్‌రావు నియమితులయ్యారు.కేటీఆర్‌కు మళ్లీ పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్‌ శాఖలు దక్కాయి. సబితా ఇంద్రారెడ్డికి విద్యా శాఖ, గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమం, ఆహార, పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాలు, సత్యవతి రాథోడ్‌కు ఎస్టీ, స్త్రీ, శిశు సంక్షేమం, పువ్వాడ అజయ్‌కుమార్‌కు రవాణా శాఖలను కేటాయించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఆదివారం కొత్తగా చేరిన ఈ ఆరుగురు మంత్రులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సలహా మేరకు శాఖలను కేటాయిస్తూ గవర్నర్‌ తమిళసై సౌందర రాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో కొందరు ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

హరీశ్, కేటీఆర్‌లకు కేటాయించిన శాఖలను ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. జగదీశ్‌రెడ్డి విద్యా శాఖను కోల్పోగా, ఆయనకు మళ్లీ ఇంధన శాఖను కేటాయించారు. గత మంత్రివర్గంలో సైతం ఆయన ఇంధన శాఖను కలిగి ఉన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నిర్వహించిన ఎస్టీ సంక్షేమ శాఖను సత్యవతి రాథోడ్‌కు, బీసీ సంక్షేమం గంగుల కమలాకర్‌కు కేటాయించారు. దీంతో కొప్పుల వద్ద ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, వికలాంగ, వయోజనుల సంక్షేమ శాఖలు మిగిలాయి. వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్వహించిన రవాణా శాఖను పువ్వాడ అజయ్‌కుమార్‌కు కేటాయించారు. చామకూర మల్లారెడ్డి నుంచి స్త్రీ, శిశు సంక్షేమ శాఖను సత్యవతి రాథోడ్‌కు అప్పగించారు. కీలకమైన రెవెన్యూ, నీటిపారుదల, గనుల శాఖలను సీఎం కేసీఆర్‌ తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రతిష్టాత్మక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన, అమలుపై స్వీయ పర్యవేక్షణ కోసం సీఎం స్వయంగా ఈ శాఖలను నిర్వహించనున్నారు. గత మంత్రివర్గంలో పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్‌ శాఖల మంత్రిగా తనదైన ముద్ర వేసిన కేటీఆర్‌కు మళ్లీ అవే శాఖలను కేటాయించారు.  

మరిన్ని వార్తలు