సమస్యల పరిష్కారానికి సానుకూలం

27 Jul, 2017 00:24 IST|Sakshi
సమస్యల పరిష్కారానికి సానుకూలం

డీలర్లతో పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌
సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు సర్కార్‌ సానుకూలంగా ఉందని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 1 నుంచి రేషన్‌ డీలర్లు సమ్మెకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో 2 రోజులుగా ఆయన వారితో చర్చలు జరిపారు. డీలర్ల కమీషన్‌ పెంపుతో పాటు వారి ఆదాయ మార్గాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ పరిస్థితిలో మంచి వాతావరణాన్ని చెడగొట్టు కోవద్దని డీలర్లకు విజ్ఞప్తి చేశారు. సమ్మెకు వెళితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాము ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాల్సి ఉంటుందన్నారు.

‘రేషన్‌ డీలర్ల ఆదాయం పెరిగేలా రేషన్‌ వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు ప్రారంభించాం. భవిష్యత్తులో రేషన్‌ షాపులు మినీ బ్యాంకులుగా మారనున్నాయి. రేషన్‌ షాపులను మినీ సూపర్‌ మార్కెట్‌లుగా మార్చాలన్న ప్రతిపాదన కూడా ఉంది. డీలర్ల కమీషన్‌ పెంపు, గౌరవ వేతనం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారు’ అని తెలిపారు. రేషన్‌ డీలర్లకు కనీస గౌరవ వేతనం రూ.30 వేలు చెల్లించాలని, డీడీ కట్టడానికి వడ్డీలేని రుణాలివ్వాలని, హెల్త్‌ కార్డులు సౌకర్యం కల్పించాలని, పోర్టబిలిటీ విషయాన్ని పునఃపరిశీలించాలని డీలర్లు.. కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. బత్తుల రమేశ్, మల్లేశం, వెంకటరమణ, నాయికోటి రాజు ఆధ్వర్యంలోని సంఘాలతో సీవీ ఆనంద్‌ చర్చలు జరిపారు.

మరిన్ని వార్తలు