నబీల్ మృతదేహానికి పోస్టుమార్టం

11 May, 2015 14:07 IST|Sakshi
నబీల్(ఫైల్)

హైదరాబాద్: పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్ పేరిట సాగించిన ముష్టియుద్ధంలో మరణించిన నబీల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తన కొడుకును ఉద్దేశపూర్వకంగానే కొట్టి చంపారనే ఆరోపణలపై పోలీస్ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నా.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. దీనిలో భాగంగా నబీల్ మృతదేహాన్ని వెలికితీయనున్నారు. ఉస్మానియా నుంచి శ్మశానానికి చేరిన డాక్టర్ల బృందం పోస్టుమార్టం నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఆ నివేదిక వచ్చిన అనంతరం తమ దర్యాప్తును వేగవంతం చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఈ నెల 3నఫజర్ నమాజ్ అనంతరం ఉదయం 5.30 గంటలకు ఫంజేషాలోని ఇండో-అమెరికన్ స్కూల్ వద్దకు నబీల్‌తోపాటు అతని స్నేహితులు మహ్మద్ ఒవేస్ అలియాస్ పటేల్ (19), ఉమర్ బేగ్ (20), సుల్తాన్ మీర్జా (22), ఇర్ఫాన్ పఠాన్ (22), షహబాజ్ అలియాస్ వసీం డాలర్ (31), అబూబకర్ (19), మరో ఇద్దరు యువకులు చేరుకొని స్ట్రీట్ ఫైట్‌కు సిద్ధమయ్యారు. గెలిచే వ్యక్తి మిగతా వాళ్లకు బిర్యానీ తినిపించాలని షరతు పెట్టుకున్నారు.

ఈ పోరుకు ఓ యువకుడు రన్నింగ్ కామెంటరీ చేయగా, డాలర్ వసీం రెఫరీగా, ఉమర్ బేగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మహ్మద్ ఒవేస్‌తో మొదటగా అబూబకర్ తలపడ్డాడు. అబూబకర్ మట్టి కరవడంతో లూజర్...లూజర్ అంటూ రన్నింగ్ కామెంట్రీ చేసిన యువకుడు ఆట పట్టించాడు. వెంటనే ఒవేస్‌తో మరో యువకుడు సుల్తాన్ ఫైట్ చేశాడు. ఫైట్ చేస్తుండగానే సుల్తాన్ చొక్కా చిరగడంతో లూజర్ అంటూ అతన్ని కూడా కామెంట్ చేశాడు.

 

మూడో ఫైటర్‌గా ఓవేస్‌తో తలపడేందుకు స్నేహితులంతా కలసి నబీల్‌పై ఒత్తిడి తెచ్చారు. నబీల్ సుముఖంగా లేకున్నా బలవంతం చేసి ఫైట్‌కు దించారు. ఈ సమయంలో సుల్తాన్ అనే యువకుడు ఒవేస్ చెవిలో ఏదో చెప్పాడు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన ఒవేస్... నబీల్‌పై ముష్టిఘాతాలు కురిపించాడు. నబీల్ తల ఎడమ కణతకు ఐదు బలమైన పంచ్‌లు తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

>
మరిన్ని వార్తలు